కుప్పం పొలిటికల్ సెంటర్‌లో ‘స్కిల్ కేస్’.. అక్రమ అరెస్ట్ అంటూ టీడీపీ, కాదు చంద్రబాబు అవినీతే అంటూ వైసీపీ ఇంటింటి ప్రచారం..
Chittoor District News: ఏపీ పాలిటిక్స్‌ను కుదిపేసిన స్కిల్ కేసు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి దీక్షలు ఆందోళనలకు కారణమైతే.. కుప్పం మాత్రం వైసీపీకి ప్రచార అస్త్రమైంది. చిత్తూరు జిల్లాలో పొలిటికల్‌గా ప్రాధాన్యత ఉన్న కుప్పం సెంటర్‌లో స్కిల్ కేసు ఇప్పుడు మారుమూగుతోంది. టిడిపి అధినేత చంద్రబాబు 1989 నుంచి వరుస విజయాలతో 7 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో..
చిత్తూరు జిల్లా, సెప్టెంబర్ 26: టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ కేసు కుప్పం వైసీపీలో కొత్త స్ట్రాటజీకి తెరతీసింది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మరింత బలపడేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. స్కిల్ కేసును ప్రచార అస్త్రంగా మార్చుకుంది. స్కిల్ కేసులో చంద్రబాబు అవినీతిని ఇంటింటికి వివరించే ప్రయత్నం చేస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి ఫోకస్‌తో కేడర్‌లో పెరిగిన ఉత్సాహం ఈ మేరకు ప్రణాళికతో ముందుకెళ్లేలా చేసింది. ఏపీ పాలిటిక్స్‌ను కుదిపేసిన స్కిల్ కేసు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి దీక్షలు ఆందోళనలకు కారణమైతే.. కుప్పం మాత్రం వైసీపీకి ప్రచార అస్త్రమైంది. చిత్తూరు జిల్లాలో పొలిటికల్‌గా ప్రాధాన్యత ఉన్న కుప్పం సెంటర్‌లో స్కిల్ కేసు ఇప్పుడు మారుమూగుతోంది. టిడిపి అధినేత చంద్రబాబు 1989 నుంచి వరుస విజయాలతో 7 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో.. పార్టీ కేడర్ బాబుపై అక్రమ కేసంటూ గగ్గోలు పెడుతోంది. మరోవైపు వైసీపీ మాత్రం చంద్రబాబు అవినీతిని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.
ఇప్పటికే వైసీపీకి టార్గెట్‌గా ఉన్న కుప్పంలో మరింత బలపడాలని చూసేందుకు స్కిల్ కేసు దోహదపడేలా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి కుప్పంపై స్పెషల్ ఫోకస్ చేసిన వైసీపీ రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే ‘వై నాట్ 175’ను తెరమీదికి తెచ్చిన వైసీపీ అధిష్ఠానం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసును గడపగడపకు తీసుకెళుతోంది. కుప్పంపై సీఎం జగన్‌తో పాటు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో స్కిల్ కేసు తరువాత క్యాడర్‌లో ఉత్సాహం మరింతగా పెరిగింది. మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబు టార్గెట్‌గా చేస్తున్న రాజకీయం కుప్పంలో వైసీపీ బలపడేందుకు కారణం కాగా ఇందులో భాగంగానే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని మెజారిటీని తెచ్చిపెట్టింది. కుప్పం నియోజకవర్గ ప్రజల్లో చంద్రబాబుపై ఉన్న సానుకూల దృక్పథానికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు స్కిల్ కేసును వైసీపీ అస్త్రం చేసుకుంది. కుప్పం వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ భరత్‌తో పాటు మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, చిత్తూరు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు స్థానిక నాయకులతో స్కిల్ కేసును జనంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నం జరుగుతోంది.
చంద్రబాబు అరెస్టుకు ముందే కుప్పం నియోజకవర్గాన్ని మంత్రి పెద్దిరెడ్డి చుట్టేయగా.. స్కిల్ కేసు తర్వాత కుప్పం వైసీపీ యంత్రాంగం గడపగడపకు వెళ్లి చంద్రబాబు స్కిల్ కేసులో అవినీతిని ఎండగడుతోంది. ఒకవైపు స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ కుప్పంలో దీక్షలు, నిరసనలు చేస్తున్న టిడిపి శ్రేణుల గగ్గోలుకు భిన్నంగా వైసీపీ పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొన్ని ప్రశ్నలు, కొన్ని నిజాలు అంటూ జనంలోకి వెళ్ళే ప్రయత్నం టిడిపి చేరింది. రైళ్ళలో ప్రయాణికులకు, ప్రజలకు కరపత్రాలు పంచుతోంది. ఇందుకు దీటుగానే వైసీపీ శ్రేణులు కుప్పంలో గడపగడపకు వెళ్లి చంద్రబాబు అవినీతి ఇదిగో అంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది. 35 ఏళ్లుగా చంద్రబాబు చేసింది అవినీతేనని జనానికి వివరిస్తున్న వైసీపీ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇస్తోంది. ఇలా స్కిల్ కేసు ఇప్పుడు కుప్పం పొలిటికల్ సెంటర్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..