- Telugu News Andhra Pradesh News Traditional Artisans using 3D technology in the art of sculpture to make idols in Guntur Telugu News
Andhra Pradesh: ఏడు తరాల సాంప్రదాయ శిల్ప కళలో త్రీడి టెక్నాలజీ.. అబ్బురపరిచే మినియేచర్స్ తయారీ…
Guntur: ఏడు తరాలుగా, వంశపారపర్యంగా వస్తున్న సాంప్రదాయ శిల్పకలకు ఆధునిక త్రీడి సాంకేతికత జత చేసి శభాష్ అనిపించే శిల్ప కళను ఆవిష్కరిస్తున్నారు. సాంప్రదాయంగా ఉన్న శిల్పకళలో త్రీడి టెక్నాలజీతో అధ్భుతమైన శిల్పాలను తయారు చేస్తున్నారు. మూడు అంగుళాల నుండి ముప్పై అడుగుల వరకూ విగ్రహాలను త్రీడి టెక్నాలజీతో రూపొందిస్తున్నారు.
T Nagaraju | Edited By: Jyothi Gadda
Updated on: Sep 26, 2023 | 8:18 PM

తెనాలికి చెందిన కాటూరి శ్రీ హర్ష త్రీడి టెక్నాలజీలో ప్రత్యేకంగా శిక్షణ పొందాడు. శ్రీ హర్ష కుటుంబంలోని ఏడు తరాలు శిల్పాల తయారీలోనే ఉన్నారు. తండ్రి వెంకటేశ్వరావు, అన్న రవి చంద్ర చేయి తిరిగిన శిల్పులు. సూర్య శిల్పశాలలో అనేక విగ్రహాలను తయారు చేశారు. అయితే సాధారణ శిల్పాల తయారిలో త్రీ డి టెక్నాలజీని శ్రీ హర్ష ఉపయోగిస్తున్నాడు. అయితే ఒక అంగుళం సైజు నుండి ఏడు అడుగుల వరకూ త్రీ డి టెక్నాలజీలో విగ్రహాలను తయారు చేస్తారు.

శ్రీ హర్ష సరికొత్త పరికరాలతో త్రీ డి టెక్నాలజీలో రూపొందించిన డిజైన్ తో ముప్పై అడుగుల వరకూ విగ్రహాలను తయారు చేస్తున్నాడు. శ్రీ హర్షలోని ప్రత్యేక కళను గుర్తించిన సౌది అరేబియాకు చెందిన స్టేషన్ అనే కంపెనీ తమ దేశంలో తమ కంపెనీలో పని చేసేందుకు రావాలని ఆఫర్ ఇచ్చింది. దీంతో త్వరలోనే సౌదీ అరేబియా వెళ్ళేందుకు శ్రీ హర్ష సిద్దమయ్యాడు. అక్కడ త్రీడి టెక్నాలజీలో రోబోటిక్స్ ఉపయోగిస్తున్నారని ఆ టెక్నాలజీలో నైపుణ్యం సాధిస్తానని శ్రీ హర్ష తెలిపాడు.

త్రీ డి టెక్నాలజీలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న శ్రీహర్షను ప్రతిష్టాత్మక కొండూరు వీర రాఘవాచార్యులు పురస్కారం వరించింది. శ్రీ హర్ష కొండూరు వీరరాఘవచార్యులు పురస్కారం అందుకున్న సందర్భంగా పలువురు శ్రీహర్షను పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

దేవతా విగ్రహాలతో పాటు రాజకీయ నేతలు, స్వాతంత్ర్య సమర యోధుల విగ్రహాలు తయారీలో ప్రత్యేక పేరు సాధించారు వెంకటేశ్వరావు అతని పెద్ద తనయుడు రవిచంద్ర. వారి దారిలోనే నడుస్తూ శిల్పకళలో శ్రీ హర్ష తనదైన ముద్ర వేసుకుంటున్నాడు.

తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ కళకు ఆధునికత అద్ది దేశ విదేశాల్లో తెనాలి ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న శ్రీహర్ష మరిన్ని అవార్డులు సాధించాలని తెనాలి వాసులు కోరుకుంటున్నారు.





























