Andhra: చవక.. చవక.. అక్కడ కేజీ చికెన్ రూ.100 మాత్రమే..
మార్కెట్ రేటులో సగం ధరకే చికెన్ లభిస్తుందంటే నాన్ వెజ్ ప్రియులు ఊరుకుంటారా చెప్పండి. సండే రోజు నాన్ వెజ్ జాతరే చేశారు. అవును అదివారం రోజు కర్నాలు జిల్లాలోని ఆ ప్రాంత ప్రజలకు కేవలం రూ.100కే చికెన్ దక్కింది.. కారణమేంటో తెలుసుకుందాం పదండి...

ప్రస్తుతం మార్కెట్‌లో చికెన్ ధర రూ 200 వరకు ఉంది. స్కిన్ లెస్ అయితే ఒక 20 ఎక్కువ ఉంటుంది.. ఎవరైనా మంచి వ్యాపారం జరగాలని భావిస్తే.. మార్కెట్ రేటుపైన రూ.10 లేదా రూ.20 తగ్గించి అమ్ముతారు. అయితే కర్నూలు జిల్లా కోడుమూరులో కేజీ చికెన్ కేవలం 100 రూపాయలకే దొరికింది. దీంతో గ్రామస్థులంతా పండగ చేసుకున్నారు. అవి మంచి కోళ్లు కాదేమో, ఏమైనా వైరస్ సోకిందని అనుకునేరు. అవి ఏ క్లాస్ బ్రాయిలర్ కోళ్లు. ఇంత చౌకగా చికెన్ దొరకడానికి కారణం ఇద్దరు వ్యాపారుల మధ్య పోటీనే.
కోడుమూరులోని బళ్లారి రోడ్డులో కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి కొత్తగా చికెన్ షాపు పెట్టాడు. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు.. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు కేజీ చికెన్ రూ.110కే అంటూ ఆఫర్ పెట్టాడు. దీంతో ఆదివారం పూట అతని షాపుకు జనం క్యూ కట్టారు. దీంతో తన వ్యాపారానికి గండి పడుతుందని భావించిన సమీప చికెన్ షాపు ఓనర్.. రూ.100 కేజీ చికెన్ ఇస్తున్నట్లు ఆఫర్ పెట్టాడు. దీంతో ఈసారి ఆ షాపు మళ్లారు జనాలు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో పక్క గ్రామాల ప్రజలు సైతం ఈ షాపులకు క్యూ కట్టారు. మాములుగా కొనే కంటే.. ఇంకా ఎక్కువగానే చికెన్ కొనుక్కు వెళ్లి ఇష్టమొచ్చిన వంటకాలు చేసుకుని.. నాన్ వెజ్ పండగ చేసుకున్నారు. ఇద్దరు వ్యాపారుల పోటీ.. నాన్ వెజ్ ప్రియులకు మేలు చేసినట్లయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




