AP Cabinet: మహిళలకు ఫ్రీ బస్సు ప్రణాళికలపై ఏపీ కేబినెట్ కీలక చర్చ.. తీసుకున్న నిర్ణయాలివే..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ విధానాలు, పనితీరుపై మంత్రులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇసుక పాలసీని రద్దు చేసిన ప్రభుత్వం.. కొత్త ఇసుక పాలసీకి ఆమోదం తెలిపింది. త్వరలో కొత్త ఇసుక పాలసీ విధివిధానాలు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరోవైపు మహిళలకు ఫ్రీ బస్సు అమలు చేసే ప్రణాళికలపై కూడా కేబినెట్‌లో చర్చించారు. పౌరసరఫరాల శాఖ 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు..కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి 3 వేల 200 కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది.
పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధివిధానాలను ఖరారు చేసేందుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించింది. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.
ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈ మధ్య ప్రభుత్వం వరుసగా రిలీజ్ చేసిన శ్వేతపత్రాలను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వ విధానాలు, పనితీరుపై కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. లోటు బడ్జెట్ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలని.. శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతినెలా సమీక్ష చేయాలని సూచించారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..