AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: పతాక స్థాయికి చేరిన కేశినేని బ్రదర్స్ పోరు.. ఏకంగా బాహాబాహి

టీడీపీలో బ్రదర్స్‌ ఫైట్‌.. కేశినాని నాని వర్సెస్‌ చిన్నీ.. ఎస్‌.. ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తిరువూరు వేదికగా కేశినేని నాని, చిన్నీ వర్గాలు రచ్చకెక్కాయి. అటు.. సమన్వయలోపమే కారణమని నాని అంటే.. అధిష్టానం చూసుకుంటుందని చిన్నీ కామెంట్స్‌ చేయడం ఆసక్తిగా మారుతోంది.

AP Politics: పతాక స్థాయికి చేరిన కేశినేని బ్రదర్స్ పోరు.. ఏకంగా బాహాబాహి
Kesineni Brothers
Ram Naramaneni
|

Updated on: Jan 03, 2024 | 9:07 PM

Share

ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో అన్నదమ్ముల మధ్య వర్గపోరు మరోసారి తీవ్రస్థాయిలో బహిర్గతమైంది. తిరువూరు టీడీపీ సమన్వయ భేటీ వేదికగా కేశినేని నాని- కేశినేని చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ నెల 7న తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి కేశినేని బ్రదర్స్‌ వేర్వేరుగానే పర్యవేక్షించడం వర్గపోరుకు దారి తీసింది. ఫలితంగా.. కొందరు నేతలు నాని వర్గంగా.. మరికొందరు చిన్ని వర్గంగా విడిపోయారు. ఈ క్రమంలో.. తిరువూరు టీడీపీ ఇన్‌చార్జ్ దేవదత్తు ఏర్పాటు చేసిన సమీక్షలో గందరగోళం ఏర్పడింది. టీడీపీ సమన్వయ భేటీ ఫ్లెక్సీలో కేశినేని నాని ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు. ఆందోళన వ్యక్తం చేస్తూ.. చిన్ని ఫ్లెక్సీని చించేశారు. చిన్నిని లోపలికి అనుమతించొద్దంటూ నాని వర్గీయులు ఆందోళనకు దిగడంతో టీడీపీ ఆఫీస్‌లో గొడవ జరిగింది.

కేశినేని నాని, చిన్నీ వర్గాల మధ్య వాగ్వాదం.. పోటాపోటీ నినాదాలతో తిరువూరు టీడీపీ ఆఫీస్‌లో గందరగోళం నెలకొంది. నాని, చిన్నీ వర్గాలు ఒకరిపైఒకరు కుర్చీలు విసురుకున్నారు. తిరువూరు ఇన్‌ఛార్జ్‌ దత్తుపై కేశినేని నాని వర్గీయుల దాడి చేశారు. ఇక.. విషయం తెలుసుకున్న కేశినేని చిన్ని.. టీడీపీ కార్యాలయానికి చేరుకోగా.. ఆయన్ను అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించింది. చిన్నిని లోపలికి రానివ్వబోమంటూ నినాదాలు చేశారు. దాంతో.. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ ఆఫీస్‌పై కేశినేని నాని వర్గీయులు దాడి చేసి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆఫీస్‌ అద్దాలు పగలగొట్టారు. కొందరు టీడీపీ నేతలు సర్దిచెప్పే యత్నం చేసినా పరిస్థితి సర్దుమణగలేదు. దాంతో.. అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపైనా దాడికి దిగారు. టీడీపీ కార్యకర్తల పరస్పర దాడిలో తిరువూరు ఎస్సై సతీష్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

ఇక.. తిరువూరు ఘటనపై ఎంపీ కేశినేని నాని రియాక్ట్‌ అయ్యారు. వివాదానికి సమన్వయలోపమే కారణమని.. ఇలాంటివాటికి ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అటు.. తిరువూరు టీడీపీ ఇన్‌చార్జ్‌పైనా ఫైర్‌ అయ్యారు కేశినాని నాని. మొత్తంగా.. ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. టీడీపీ కార్యకర్తలు, నేతలు.. నాని, కేశినేని వర్గాలుగా విడిపోయారు. అదేసమయంలో.. ఎంపీ కేశినాని నాని.. తిరువూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ దత్తు టార్గెట్‌గా విమర్శలు చేయడం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..