AP News: అన్నతో 25 నిమిషాల పాటు షర్మిల భేటీ.. ఏం మాట్లాడుకున్నారు..?
అన్నయ్య జగన్‌కు పెళ్లి పిలుపు అందించారు చెల్లెలు షర్మిల. ఫ్యామిలీతో తాడేపల్లి వెళ్లిన షర్మిల.. తనయుడు రాజారెడ్డి నిశ్చితార్ధం, వివాహ వేడుకకి ఆత్మీయ ఆహ్వానం అందించారు. ఈ భేటీ తెలుగురాష్ట్రాల్లో పొలిటికల్‌గా ఆసక్తికరంగా మారింది.

తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్‌ను కుటుంబసమేతంగా కలిశారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. నిన్న కుటుంబసభ్యులతో ఇడుపాలపాయకు వెళ్లిన షర్మిల.. ఇవాళ నేరుగా తాడేపల్లికి వెళ్లారు. జగన్ – షర్మిల మధ్య దూరం పెరిగినట్టు సుదీర్ఘ కాలంగా వార్తలు వచ్చిన వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన అట్లూరి ప్రియాను.. రాజారెడ్డి వివాహం చేసుకోబోతున్నారు. జనవరి 18న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న వివాహం జరుగనుంది. ఈ వివాహ కార్యక్రమానికి తన సోదరుడు జగన్, వదిన భారతికి పెళ్లి శుభలేక అందించి ఆహ్వానమందించారు షర్మిల. ఆమెతో పాటు బ్రదర్ అనిల్, రాజారెడ్డి, కోడలు ప్రియ కూడా వెంటే ఉన్నారు.
2021లో ఇడుపులపాయలో జగన్, షర్మిల కలుసుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత అన్నాచెల్లెళ్లు కలుసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. జగన్, షర్మిల కలుసుకోవడంతో ఏపీ రాజకీయ పరిణామాలపై చర్చ జరిగి ఉంటుందా అని పలువురు అంచనా వేశారు. 25 నిమిషాల పాటు జరిగిన భేటీలో రాజకీయాల గురించి కాకుండా.. కేవలం వ్యక్తిగత అంశాలపై మాత్రమే చర్చ జరిగినట్టు సమాచారం.
షర్మిల కాన్వాయ్ వెంటే తాడేపల్లి వెళ్లారు మంగళగిరి ఎమ్మె్ల్యే ఆర్కే. అయితే ఆయన కారును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆలస్యం అయిన కారణంగానే పర్మిషన్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు ఆర్కే. ఇక షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరాక పోటీపై నిర్ణయం తీసుకుంటానన్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం నేరుగా నోవాటెల్ హోటల్ వెళ్లిన షర్మిల.. ఆక్కడినుంచి ఢిల్లీకి పయనమయ్యారు. రేపు రాహుల్, ప్రియాంక, మల్లిఖార్జున ఖర్గేలతో భేటీకానున్నారు. వాళ్ల సమక్షంలో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని విలీనం చేస్తారు. అయితే షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు లేదంటే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. అలాగే కడప ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జోరందుకుంది. మొత్తానికి కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం తర్వాత ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
