Sankranti: సంక్రాంతికి ఇంటికెళ్లేవారికి భారీ ఊరట.. టోల్ గేట్ల వద్ద నో బ్రేక్.. కొత్త విధానం అమలు
సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం కలిగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతీ ఏడాది పండుగ సమయాల్లో టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు టోల్ ప్లాజాల వద్ద బూస్టర్ లైన్లను ప్రవేశపెట్టనున్నారు.

సంక్రాంతి సందర్భంగా ఇంటికెళ్లే ప్రయాణికులతో తెలుగు రాష్ట్రాల్లోని టోల్‌గేట్లు కిక్కిరిసి కనిపిస్తాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల టోల్‌గేట్ల వద్ద క్లియరెన్స్ వచ్చేందుకు గంటల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. దీని వల్ల ప్రతీ ఏడాది టోల్‌గేట్ల వద్ద వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్‌లో గంటలకొద్ది వెయిట్ చేయలేక సమతమతమవుతున్నారు. సంక్రాంతికి హైదారాబాద్ నుంచి పెద్ద ఎత్తున వాహనాలు తెలంగాణలోని ఇతర జిల్లాలు, ఏపీకి వెళుతుంటాయి. దీంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న క్రమంలో దీనికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(HGCL) కొత్త ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించింది. టోల్‌గేట్ల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అదే బూస్టర్ లైన్ల విధానం.
బూర్టర్ లైన్ల ఏర్పాటు
సంక్రాంతికి వేలాది వాహనాల రాకపోకల వద్ద ఓటర్ రింగ్ రోడ్డుపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ భారీగా ఏర్పడనుంది. దీనిని నివారించేందుకు టోల్‌ప్లాజాల వద్ద బూస్టర్ లైన్లను ప్రవేశపెట్టాలని హెచ్‌జీసీఎల్ నిర్ణయం తీసుకుంది. శంషాబాద్, బొంగలూరు, పెద్ద అంబర్‌పేట టోల్‌ప్లాజాల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ బూస్టర్ బారియర్ల వద్ద ఫాస్టాగ్ వాహనాలు ఇక టోల్‌ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు. నేరుగా వెళ్లిపోవచ్చు. ఇందుకోసం టోల్‌గేట్ల వద్ద రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా వాహనాలు ఆగకుండా త్వరగా వెళ్లవచ్చు. ప్రస్తుతం ఇక్కడ 12 నుంచి 15 టోల్ బూత్‌లు ఉండగా.. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సరిపోవడం లేదు. దీంతో ఈ బూస్టర్ బారియర్స్‌ను పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
టోల్ ఫ్రీ..?
సంక్రాంతికి ఇంటికెళ్లే వాహనదారుల దగ్గర టోల్ ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా అనుమతించాలని రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాశాయి. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ఇక మంత్రి నారా లోకేష్ కూడా టోల్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా అనుమతించాలని కోరారు. దీంతో కేంద్రం కూడా టోల్ ఫీజు మినహాయింపు ఇచ్చే అవకావముందని తెలుస్తోంది. ఇదే జరిగితే సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు ఊరట లభించినట్లే. టోల్ ఫీజు చెల్లించాలంటే టోల్ గేట్ల వద్ద గంటల పాటు ఆగాల్సి ఉంటుంది. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. అదే టోల్ ఫీజు లేకపోతే ఆగకుండా వెళ్లిపోవచ్చు. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ నుంచి వాహనదారులకు ఉపశమనం లభించే అవకాశముంది,.
