AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan – Chandrababu Meet: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత నివాసానికి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌కు.. చంద్రబాబు స్వాగతం పలికారు.

Pawan - Chandrababu Meet: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ..
Pawan Kalyan - Chandrababu Naidu Meet
Shaik Madar Saheb
|

Updated on: Jan 08, 2023 | 12:28 PM

Share

జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత నివాసానికి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌కు.. చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం పవన్.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతలు పలు విషయాలపై సుధీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ఏపీలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, వచ్చే ఎన్నికల్లో పొత్తులు తదితర విషయాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. 3 నెలల వ్యవధిలోనే ఇద్దరు నేతలు మరోసారి భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్య కార్యచరణ ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ అంశంపైనే వీరిద్దరి మధ్య చర్చ జరుగుతోందని పేర్కొంటున్నారు. ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన రోడ్‌షోల రద్దు జీవో, ఆంక్షలపై ఇరు పార్టీల నేతలు చర్చిస్తున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసుల ఆంక్షలు, పవన్ వైజాగ్ టూర్ లో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆంక్షలపై ఉమ్మడి పోరాటం నిర్వహించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా జీవో నెంబర్‌ 1పై ఉమ్మడి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు.

కాగా.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని ఇప్పటికే ఇద్దరు నేతలు నిర్ణయించారు. గత ఏడాది ఆక్టోబర్‌ 18న విజయవాడలోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్‌ 1 పైనా తాజా భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు,పవన్‌ తాజా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

గతంలో పవన్‌ విశాఖ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పుడు పవన్‌ను కలిసి చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఇప్పుడు కుప్పం పర్యటన తర్వాత చంద్రబాబు ఇంటికి పవన్‌ కల్యాణ్‌ వచ్చి చర్చలు జరపడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈనెల 12న శ్రీకాకుళంలో జనసేన యువశక్తి సభ గురించి కూడా చర్చించనున్నారు. ఆ కార్యక్రమామానికి పోలీసులు విధించిన పలు ఆంక్షలపై ఇప్పటికే జనసేన అభ్యంతరం వ్యక్తంచేసింది. విపక్షాలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటూ టీడీపీ, జనసేన వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.

ఈ క్రమంలో ప్రభుత్వం విధానాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించడంతోపాటు ముందస్తు ఎన్నికలపైనా చర్చిస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..