Nara Lokesh : కోనసీమ రైతులు క్రాప్‌హాలీడే ప్రకటనలు వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : నారా లోకేష్
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అంటేనే పచ్చని పైర్లకు చిరునామా.. అని చెప్పిన ఆయన, అలాంటి చోట క్రాప్ హాలిడే ప్రకటించడం అత్యంత బాధాకరమన్నారు..
East Godavari Farmers crop holiday decision : కోనసీమ ప్రాంతంలో రైతులు క్రాప్‌హాలీడే ప్రకటనలు వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేష్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అంటేనే పచ్చని పైర్లకు చిరునామా.. అని చెప్పిన ఆయన, అలాంటి చోట క్రాప్ హాలిడే ప్రకటించడం అత్యంత బాధాకరమన్నారు. మూడు పంటలు పండే అటువంటి ప్రాంతంలో రైతులు పంటల విరామానికి నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితుల్ని ఆయన తప్పుబట్టారు. పూడుకుపోయిన డ్రైయిన్లు, వరుస విపత్తులు, ముంపు బెడతతో పంట విరామానికి కోనసీమ రైతులు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని లోకేష్ అభిప్రాయపడ్డారు.
ముంపు సమస్యని పరిష్కరించడంలేదని గత్యంతరం లేకే ఖరీఫ్‌కి క్రాప్ హాలీడే ప్రకటించామని కోనసీమ రైతులు చెబుతున్నారని లోకేష్ అన్నారు. కోనసీమ ప్రాంతాల్లో ఏటా వేలాది ఎకరాలు ముంపునకు గురై, కోట్ల రూపాయల పంట నష్టపోతున్న రైతులు 2011 తరువాత క్రాప్ హాలీడే నిర్ణయం తీసుకోవడం వారి ఇబ్బందుల తీవ్రతని తెలియజేస్తోందని లోకేష్ చెప్పుకొచ్చారు. నాట్లు వేయకుండా పంట విరామానికి మొగ్గు చూపుతున్న రైతులతో ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం వుందని లోకేష్ తెలిపారు.
క్రాప్ హాలీడేకి రైతులు సిద్ధం కావడానికి ముంపు ప్రధాన కారణమైతే, పంట నష్టపోయినా పంట నష్టపరిహారం అందకపోవడం మరొక కారణంగా తెలుస్తోందని లోకేష్ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కోనసీమ ప్రాంతంలో క్రాప్‌హాలీడేకి సిద్ధమవుతోన్న రైతుల సమస్యలు తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన పరిశీలించి, ప్రోత్సాహాకాలు అందించి మళ్లీ రైతులు పంటలు వేసేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.