AP News: తెల్లారేసరికి ఇంట్లో కనిపించని బాలిక.. కంగారుగా చుట్టుప్రక్కల వెతకగా.. ఇంతలో.!
రెండు రోజుల క్రితం వారికి ఎప్పటిలాగే అందరికి తెల్లవారినట్లే తెల్లవారింది. అయితే ఇంట్లో ఉండాల్సిన పదిహేడేళ్ళ బాలిక మాత్రం కనిపించలేదు.
రెండు రోజుల క్రితం వారికి ఎప్పటిలాగే అందరికి తెల్లవారినట్లే తెల్లవారింది. అయితే ఇంట్లో ఉండాల్సిన పదిహేడేళ్ళ బాలిక మాత్రం కనిపించలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెదకడం ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత మైనింగ్ కొండ కింద బాలిక మృతదేహం కనిపించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పోలీసులకు ఫిర్యాదు అందటంతో రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన బాలిక ఇంటర్ చదువుతూ మధ్యలోనే చదువు ఆపేసింది. ఇంటి వద్దే ఉంటున్న ఆమెకు వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కొద్దికాలంగా వారిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆమెను మందలించారు. చిన్న వయస్సులో ప్రేమ ఏంటంటూ నిలదీశారు.
తల్లిదండ్రుల మందలించడంతో మనస్థాపానికి గురైంది. కానీ బయటకు తెలియనివ్వలేదు. ఆ రోజు రాత్రి కూడా కుటుంబసభ్యులతో సంతోషంగానే గడిపింది. కానీ తెల్లవారుజామున మాత్రం ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఆమె ఉపయోగించే ఫోన్ పార్ట్స్ కూడా బాలిక చనిపోయిన కొండపై లభించాయి. దీంతో ఆమె తల్లిదండ్రులు బాలికను ప్రియుడే హత్య చేశాడని ఆరోపించారు. అతను ఫోన్ చేసి పిలిచాడని ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా బాలిక హత్యకు కారణమైన ప్రియుడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ బాలిక మృతదేహంతో పేరేచర్ల జంక్షన్‌లో ఆందోళనకు దిగారు. పోలీసులు ఆత్మహత్యగా నమోదు చేశారని దాన్ని హత్య కేసుగా మార్చాలని డిమాండ్ చేశారు. సౌత్ డీఎస్పీ మహబూబ్ బాషా కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు మృతురాలు కుటుంబసభ్యులు. కాగా, ఇది ఇంతకీ హత్యా.? ఆత్మహత్యా.? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.