AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: భార్యను భుజాలపై ఎత్తుకొని తిరుమల కొండెక్కాడు.. సత్తిబాబు గారు మీరు సూపరండీ..

మాములుగా తిరుమల మెట్లు ఎక్కడానికే చాలామంది ఆపసోపాలు పడతారు. అలాంటిది భార్యను భుజాలపై కూర్చోబెట్టుకుని ఇతను అలవోకగా 70 మెట్లు ఎక్కేశాడు.

Konaseema: భార్యను భుజాలపై ఎత్తుకొని తిరుమల కొండెక్కాడు.. సత్తిబాబు గారు మీరు సూపరండీ..
Husband climbs Tirumala steps carrying his wife on shoulders
Ram Naramaneni
|

Updated on: Oct 02, 2022 | 5:01 PM

Share

గోదారోళ్ళు అంటే ఎటకారమే కాదు భక్తి, ప్రేమాభిమానాలకు పెట్టింది పేరు. ఊరికే మాటలు చెప్పడం కాదు.. చేతలతో చూపిస్తుంటారు. ఇదిగో అలాంటి దంపతులే వీరు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని వరదా వీర వెంకట సత్యనారాయణ(సత్తిబాబు) లావణ్య దంపతులు ఏడుకొండలు దర్శనానికి తిరుపతి వెళ్లారు. గోదావరి జిల్లాల వారు అధికంగా కాలినడకనే ఏడు కొండలు ఎక్కుతామని మొక్కుకుంటారు. వీరు కూడా శ్రీవారి మెట్ల గుండా  నడిచి వెళ్తున్నారు. అయితే వేగంగా మెట్లు ఎక్కుతున్న సత్తిబాబును చూసి భార్య లావణ్య మీరు ఎక్కడం కాదు దమ్ముంటే నన్ను ఎత్తుకుని ఎక్కమని సరదాగా సవాల్ చేసింది. ఆ సవాల్‌ను సీరియస్‌గా తీసుకున్న సత్తిబాబు భార్యను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లు ఎక్కడం మొదలు పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కారు. అలా ఆ జంట వెళ్తుంటే ఫోటోలు, వీడియోలు తీయడానికి మిగిలిన భక్తులు పోటీపడ్డారు.

పెళ్లైన కొత్తలో ఇలాంటి ప్రేమలు సర్వసాధారణమే అని కొట్టి పడేయకండి. వీరికి పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందో చెబితే ఆశ్చర్యపోవలసిందే ఎవరైనా. వీరి వివాహం 1998లో జరిగింది. అంటే ఇరవై నాలుగేళ్లు. మరో విచిత్రమైన విషయం చెప్పమంటారా… ! వీరి ఇద్దరమ్మాయిలకూ పెళ్లిళ్లు కూడా చేశారు. తాత,అమ్మమ్మలు అయిపోయారు. వీళ్ళ పెద్ద అల్లుడు గురుదత్త(చందు) మంచి సాప్ట్ వేర్ ఉద్యోగం వస్తే అటు పుట్టింటివారిని, ఇటు అత్తంటి వారిని తిరుమల తీసుకొస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. ఉద్యోగం రావడంతో బస్సులో నలభై మందిని తిరుపతి తీసుకెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగానే ఈ సత్తిబాబు సాహసం చేశారు. ఏది ఏమైనా ఈ దంపతులు ఒకరిపై.. ఒకరిపై ప్రేమతో ఉండటం చూసి నిజంగా ముచ్చటేస్తుంది. కావాలంటే దిగువ వీడియోలో మీరే చూడండి.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందరో యువ జంటలకు సవాల్ విసురుతుంది. తొందరపడి ఈ సాహసానికి అందరూ ప్రయత్నించకండోయ్..తేడా వస్తే అసలకే ఎసరు వస్తుంది.

—సత్య, టీవీ9 ప్రతినిధి, కోనసీమ

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..