Andhra Pradesh: చింతకాయల విజయ్ కుమార్ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు.. నేతల మధ్య మాటల యుద్ధం..
ఏపీ టీడీపీనేత అయ్యన్న పాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ కుమార్ ఇంట్లో.. శనివారం ఏపీ సీఐడీ పోలీసులు సోదాలు చేయడం సంచలనం రేపింది.
ఏపీ టీడీపీనేత అయ్యన్న పాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ కుమార్ ఇంట్లో.. శనివారం ఏపీ సీఐడీ పోలీసులు సోదాలు చేయడం సంచలనం రేపింది. బంజారాహిల్స్, ట్రెండ్‌సెట్ విల్లాలోని ఆయన ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సీఐడీ సిబ్బంది.. విజయ్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో 41(ఏ) సీఆర్‌పీసీ ప్రకారం ఇంటి గోడలకు నోటీసులు అంటించి వెళ్లారు. ఈనెల 6న ఉదయం 10:30 గంటలకు మంగళగిరి సీఐడీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు. లేదంటే, 41ఏ (3) (4) కింద అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఏపీ రాజకీయాల్లో పెను దుమారం..
అయితే, విజయ్‌కుమార్ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు చేయడం.. ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించింది టీడీపీ. మఫ్టీలో వచ్చిన పోలీసులు.. సెక్యూరిటీ సిబ్బందిపైనా, అక్కడున్న పిల్లలపైనా దాడి చేశారని ఆరోపించింది. ప్రశ్నించినవారినల్లా తప్పుడు కేసులతో వేధించడం తప్ప ఈ మూడేళ్లలో వైసీపీ సర్కార్ చేసిందేమీ లేదంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ నేతల్ని వేధించడమే పోలీసులు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
బలహీన వర్గాలను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. చిన్నపిల్లలపై కూడా దాడి చేసేస్థాయికి పోలీసులు దిగజారడం సిగ్గుచేటన్నారు.
టీడీపీకి వైసీపీ రివర్స్ కౌంటర్లు..
అయితే, ఈ విషయంలో టీడీపీకి రివర్స్ కౌంటర్లు ఇచ్చింది వైసీపీ. దొంగ ఇంటికి సీఐడీ వెళితే తప్పేంటని ప్రశ్నించింది. టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారనీ.. తప్పు చేయనప్పుడు విజయ్‌కుమార్ గోడదూకి ఎందుకు పారిపోయారో చెప్పాలనీ నిలదీస్తోంది. చట్టం తనపనితాను చేసుకుపోతుందని.. అది ఎవరికీ చుట్టం కాదనీ స్పష్టం చేసింది.
చింతకాయల విజయ్ సోషల్ మీడియా అరాచకవాది అంటూ.. మండిపడ్డారు మంత్రి మేరుగు నాగార్జున. మహిళలపై దారుణంగా పోస్టులు పెట్టడం దుర్మార్గమన్నారు. తప్పుడు పోస్టులు పెట్టినవారిని.. విచారించకుండా ఎలా వదిలి పెడతారని ప్రశ్నించారు. దొంగను పట్టుకోవడానికి సీఐడీ వెళ్తే తప్పేంటన్నారు మంత్రి మేరుగు. మరోమంత్రి జోగి రమేశ్ సైతం అయ్యన్న పాత్రుడి కుమారుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటి అరాచక వాది సభ్యసమాజంలో ఉండటం శ్రేయస్కరం కాదన్న మంత్రి.. తక్షణం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నారు. అంతేకాదు, ఆడవారిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే ఇలాంటి నీచుల్ని.. చంద్రబాబు, లోకేశ్ సపోర్ట్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు జోగి రమేశ్.
ఐటీడీపీ ద్వారానే యాప్ క్రియేషన్..
ఏపీలో కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ.. ఓ యాప్ సర్క్యులేట్ కావడమే ఈ వివాదానికి కారణమైంది. కొద్దిరోజులుగా గూగుల్‌పే, ఫోన్‌పే తరహాలోనే.. కొత్త పేరుతో ఓ యాప్ పేజ్ సర్క్యులేట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారడంతో వైసీపీ శ్రేణులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైరలైన పోస్టింగ్స్ ఆధారంగా.. ఏపీ సీఐడీ వింగ్ సైబర్‌క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఐటీ చట్టంతో పాటు, ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ కూడా రిజిస్టర్ చేశారు. టీడీపీ ఐటీ వింగ్‌లోని ఐటీడీపీ ద్వారానే ఈ పేజ్ క్రియేట్ అయినట్టు నిర్ధారించిన పోలీసులు.. దీనికి నిర్వాహకుడిగా ఉన్న చింతకాయల విజయ్‌కుమార్‌తో పాటు మరికొంత మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పుడిదే అంశం దుమారం రేపుతుండగా.. రాజకీయంగా పాలక, ప్రతిపక్షాల మధ్య కొత్త చిచ్చు రాజేసింది. ఇది ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..