AP Heat wave: ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, వెల్లడించిన విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ
ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది సాధారణం సాధారణం కంటే ఎక్కవగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. వడగాలుల సంసిద్ధత, ఉపశమన చర్యలపై ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది సాధారణం సాధారణం కంటే ఎక్కవగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. వడగాలుల సంసిద్ధత, ఉపశమన చర్యలపై ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణ శాఖ సీజనల్ ఔట్లుక్-2023 ప్రకారం వాతావరణంలోని మార్పులు, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, సముద్రానికి దగ్గరగా ఉండటం వలన ఏపీ లో వడగాల్పులు ఎక్కువగా వీయటం, అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం జరుగుతుందన్నారు. ఐఎండీ అంచనా ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు తెలిపారు. ఎన్డీఎంఏ మార్గదర్శకాల ప్రకారం వడగాల్పుల పై కార్యాచరణ ప్రణాళిక విపత్తుల నిర్వహణ సంస్థ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. దీనిలో ప్రభుత్వ శాఖల వారీగా అమలు చేయాల్సిన ప్రణాళికలు వివరించడం జరుగుతుందని వెల్లడించారు.
2016లో 723 మంది , 2017లో 236, 2018లో 8, 2019లో 28 మంది వడగాల్పుల వల్ల చనిపోగా విపత్తుల సంస్థ, జిల్లాయంత్రాంగం మాత్రం 2020,21,22లో వడగాల్పుల మరణాలు అసలు సంభవించలేదని తెలిపింది . అయితే జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులు ఈ సంవత్సరం అదే కృషితో ప్రాణనష్టం లేకుండా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ తీసుకోవాలని కోరారు.ఈ మేరకు పలు సూచనలు చేశారు.
1.జిల్లా మరియు మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. 2.బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ కార్యాలయాల్లో, పని ప్రదేశాల్లో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ప్రారంభించే విధంగా NGOలు, కమ్యూనిటీ బృందాలు, ఇతర సంస్థలను కోరాలి. 3. బహిరంగ ప్రదేశాల్లో అవగాహన పోస్టర్‌లను ప్రదర్శించడం, టీవీల్లో స్క్రోలింగ్ చేయడం, థియేటర్‌లలో వీడియోలు ప్లే చేయడం, కరపత్రాల పంపిణీ మొదలైన వాటి ద్వారా వడగాల్పుల సమాచారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కోసం ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి.క్షేత్రస్థాయిలో గ్రామ,వార్డు సచివాలయల్లో పోస్టర్లతో అవగాహాన కల్పించాలి 4.వడగాల్పుల తీవ్రతను బట్టి పాఠశాల సమయాలను మార్పు లేదా మూసివేయాలి. 5.వైద్య శిబిరాలు నిర్వహించడం, ORS ప్యాకెట్లు మరియు ఇతర మెడిసిన్లు తగినంత స్టాక్ ఏర్పాటు చేసుకోవాలి. 6.కీలకమైన సౌకర్యాలకు (ఆసుపత్రులు మరియు UHCలు వంటివి) నిరంతర విద్యుత్ సరఫరాకు విద్యుత్ సంస్థలు ప్రాధాన్యత ఇవ్వాలి.
అలాగే అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విభాగాన్ని విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ లో ఏర్పాటు చేసినట్లు ఎండీ అంబేద్కర్ తెలిపారు. జిల్లా యంత్రాంగానికి నాలుగు రోజుల ముందు హీట్ ఇండెక్స్, రెండు రోజుల ముందుగా ఉష్ణోగ్రత వివరాలు, వడగాలుల తీవ్రతపై సూచనలు జారీచేయనున్నట్లు పేర్కొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఐఎండీ సూచనల మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి ప్రాణనష్టాన్ని తగ్గిస్తుందన్నారు. వడగాల్పుల తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విపత్తుల సంస్థ హెచ్చరిక సందేశాలు ప్రజలకు పంపనున్నట్లు చెప్పారు. ఎండలతోపాటు అప్పుడప్పుడు క్యుములోనింబస్ మేఘాల వలన వర్షాలతో పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.