AP – Telangana: ఎన్నాళ్ళకు గుర్తొచ్చానే వాన…. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు ఇక ఈ పాటే
వరుణుడి కోసం తెలుగురాష్ట్రాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. జులై తర్వాత నుంచి వాన చుక్క లేకుండా పోవడంతో జనం అల్లాడుతున్నారు. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. దీంతో ఉక్కపోతతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయితే ఎండల నుంచి ఉపశమనం కలిగేలా వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాగల మూడురోజుల్లో వర్షాలు పడతాయని తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంది.
తెలుగు రాష్ట్రాలపై వరుణుడు కరుణ చూపించనున్నాడు. ఆగస్టు నెలలో సాధారణంగా కురవాల్సిన వర్షం కూడా కురవక పోవడంతో బెంగపడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వానలు కురియనున్నట్టు తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై వ్యాపించి ఉన్న ఒక ఉపరితల ఆవర్తనం కు రేపు ఉత్తర బంగాళాఖాతంపై ఏర్పడనున్న మరో ఉపరితల ఆవర్తనం జత కట్టనుంది. ఈ రెండింటి ప్రభావం తో ఐదో తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు గట్టిగా చెబుతున్నారు.
ఐదో తేదీ వరకు వర్షాలే
ఆదివారం నుంచి 5 వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో మూడు నాలుగు తేదీల్లోనూ, కోస్తా తెలంగాణలో మూడు నుంచి ఐయిదో తేదీ వరకు మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు మ్యాప్ లు చూపించి మరీ చెబుతున్నారు.
తెలంగాణ, హైదరాబాద్ లో మళ్లీ ప్రతాపం చూపనున్న వరుణుడు
ఇటీవల కాలంలో వానలు వస్తున్నాయంటే హైదరాబాద్ వాసుల గుండెల్లోనుంచే మెట్రో రైల్ వెళ్తోంది. ఇటీవల కురిసిన వర్షాలు, దాంతో మురిసి విరుచుకుపడ్డ మూసీ నది ఉగ్ర రూపాన్ని మరచిపోక ముందే మళ్లీ పలకరించనున్నాడు వరుణుడు. రాగల మూడు రోజుల పాటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని తెలపగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వానలు పడనున్నట్టు వివరించింది.
విశాఖ మన్యంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం పడింది. ఒక్కసారిగా వాతావరణం మారి మేఘావృతం అయి వాన పడింది. సుమారు రెండు గంటల పాటు వాన పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవగా పొలాల్లో గట్ల మీద నుంచి నీరు పారింది. మొక్కలు వేసిన, విత్తు పెట్టిన రైతులకు కూడా ఇప్పుడు వాన చాలా అవసరం. వరుణా రావయ్యా.. పాలాల్ని తడిపి వెళ్లవయ్యా అంటున్నారు రైతులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..