Weekend Hour: ముందస్తుకు ఏపీ సిద్ధమేనా? జమిలితో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్‌?

Weekend Hour: ముందస్తుకు ఏపీ సిద్ధమేనా? జమిలితో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్‌?

Ram Naramaneni

|

Updated on: Sep 02, 2023 | 9:26 PM

ఏపీలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు వస్తాయని ఇప్పటిదాకా భావించినా.. జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాలతో ముందస్తు ఊహాగానాలు జోరందుకున్నాయి. అటు అధికార పార్టీ ఎప్పుడైనా ఓకే అంటోందా? విపక్షాలు కూడా యుద్ధానికి సిద్ధమేనంటూ సవాల్‌ చేస్తున్నాయా? పార్టీలు వ్యూహాలు అలా ఉంటే.. అటు ఎన్నికల సంఘం కూడా ఆగస్టు మొదటివారంలోనే రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ ఆదేశాలివ్వడం కూడా ముందస్తుపై అలజడికి కారణమైంది.

ఏపీలో ముందస్తు ఎన్నికలపై ప్రచారం కొత్తకాదు. చాలాకాలంగా దీనిపై ఊహాగానాలున్నాయి. అయితే అధికారపార్టీ పలుసందర్భాల్లో వార్తలను ఖండించడమే కాదు. ప్రజాతీర్పుకు కట్టుబడి ఐదేళ్లపాటు పూర్తిగా ప్రజాపాలన అందిస్తామని గతంలోనే ప్రకటించారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఇప్పటిదాకా అనుమానం మాత్రమే ఉండేది కానీ కేంద్రంలో మారుతున్న సమీకరణాల్లో ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ అంటున్న కేంద్రం డిసెంబర్‌లోనే ఎన్నికలు పెడతారంటూ చర్చ మొదలైంది. పార్లమెంట్‌కు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఏపీలోనూ ముందుగానే వచ్చే అవకాశం ఉంది. అయితే వన్‌ నేషన్‌- వన్ ఎలక్షన్‌ మంచి ఆలోచనే అయినా.. సాధ్యమేనా అన్న సందేహాలు తమకున్నాయని అధికార వైసీపీ అంటోంది. పార్టీలను సంప్రదించిన తరువాతే కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎలాగూ ఏపీలో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రెండు మూడు నెలల ముందు ఎన్నికలు వచ్చినా ఇబ్బందేం లేదంటోంది పార్టీ.

అటు విపక్షాలు కూడా మారుతున్న పరిణామాలతో అప్రమత్తం అయ్యాయి. సమయం లేదు మిత్రమా అంటూ ఎన్నికలకు సిద్ధమివ్వాలని కేడర్‌ను సమాయత్తం చేస్తున్నాయి పార్టీలు. జమిలిని స్వాగతిస్తున్నామన్నామంటోంది జనసేన. సాధ్యసాధ్యాలపై చర్చ జరిపిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామంటోంది. పొత్తులపైనా చర్చలు జరుగుతున్నాయని ఈ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

రాజకీయ పార్టీలే కాదు ఎన్నికల సంఘం కూడా ఏపీలో ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఓటర్లజాబితా సవరణ మొదలైంది. అటు రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి కూడా ఆగస్టు2నే 175 నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ గెజిట్‌ విడుదల చేశారు. దీంతో ముందస్తుపై ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. నిజంగానే ముందస్తు వస్తాయా? వస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Published on: Sep 02, 2023 07:01 PM