Vizianagaram: వృద్ధురాలి మృతదేహాన్ని వాసన చూసి.. అక్కడక్కడే తిరిగిన పోలీస్ డాగ్స్.. ఆ తర్వాత
బంగారం కోసం నాన్నమ్మనే హతమార్చిన మనవడి దారుణం విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. భోగాపురం మండలం ముడసలపేటలో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించి, నిందితుడైన మనవడిని అరెస్టు చేశారు. డాగ్ స్క్వాడ్ ఆధారాలతో అనుమానం బలపడగా, విచారణలో హత్య చేసిన నిజం బయటపడింది. దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముడసలపేట ఎయిర్‌పోర్టు కాలనీలో డిసెంబరు 12న జరిగిన వృద్ధురాలి హత్య కేసును చేధించారు పోలీసులు. బంగారం కోసం నాన్నమ్మను దారుణంగా హత్య చేసిన మనవడిని అరెస్టు చేసి.. దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ముడసలపేట గ్రామానికి చెందిన ముడసల అప్పయ్యమ్మ (70) అనే వృద్ధురాలు డిసెంబరు 12న హత్యకు గురయ్యారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు చెవి రింగులు, జుమ్మాలు, చెవి మధ్య రింగులు, ముక్కు కమ్మలు, వెండి పట్టీలు గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లినట్లు మృతురాలి కోడలు ముడసల లక్ష్మి డిసెంబరు 13న భోగాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. కేసు దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించాయి. నేరస్థల పరిశీలన సమయంలో డాగ్ స్క్వాడ్ పదేపదే మృతురాలు మనుమడు ముడసల గౌరి (27) చుట్టూ తిరగడంతో అతడిపై పోలీసులు అనుమానం కలిగింది.
నేరం జరిగిన తర్వాత కొన్ని రోజులు గడిచినప్పటికీ, ఎవరికీ అనుమానం రాకుండా దొంగిలించిన బంగారం విక్రయించాలన్న ఉద్దేశంతో అతడు వాటిని తీసుకుని వెళ్తుండగా భోగాపురం పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 18.250 గ్రాముల బంగారు ఆభరణాలు, 106 గ్రాముల వెండి పట్టీలను పోలీసులు రికవరీ చేశారు. విచారణలో నిందితుడు సంచలన విషయాలు వెల్లడించారు. మృతురాలు తన కుమార్తెకు, చిన్న కుమారుడికి ఆర్థిక సహాయం చేస్తూ, పెద్ద కుమారుడి కుటుంబానికి డబ్బులు ఇవ్వకపోవడంతో మనవడు గౌరిలో కక్ష పెరిగిందని పోలీసుల విచారణలో తేలింది. డిసెంబరు 12న మద్యం మత్తులో ఉన్న గౌరి బైక్ ఫైనాన్స్ కోసం డబ్బులు అడగగా, నాన్నమ్మ నిరాకరించడంతో ఆమె ముఖంపై తలగడతో అదిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
హత్య అనంతరం ఇది బయటపడకుండా ఉండేందుకు ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకుని, బహిర్భూమికి వెళ్లే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు నమ్మించేందుకు శవాన్ని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి నూతి సమీపంలో పడేశాడు. తరువాత తనకేమీ తెలియనట్లు అందరితో కలిసి మృతదేహం వద్ద కొంతసేపు రోదించినట్లు నటించాడు. అయితే డాగ్ స్క్వాడ్ పరిశీలనలో అనుమానం రావడంతో నిఘా పెట్టి నిందితుడు గౌరీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అభినందించారు. ఈ కేసులో కీలకంగా పని చేసిన డీఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సీఐ కే.దుర్గాప్రసాద్, ఎస్ఐలు పి.పాపారావు, కే.లక్ష్మణరావు, ఏఎస్‌ఐ గౌరి శంకర్ సహా ఇతర సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు. గ్రామాల శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న వృద్ధులు, ఒంటరి మహిళల భద్రతపై స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని, పోలీసులు కూడా ఇటువంటి కుటుంబాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




