Kurnool: ఆ ఇద్దరు లేడీస్ మహారాష్ట్ర నుంచి వచ్చారు.. బాగా రష్ ఉన్న బస్సులు ఎక్కుతున్నారు.. ఆరా తీయగా
ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అడ్డం పెట్టుకుని అంతర్రాష్ట్ర మహిళా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. కర్నూల్ ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీని అవకాశంగా మలుచుకుని, తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు దొంగిలించిన మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, మఫ్టీ నిఘాతో నిందితులను పట్టుకున్న పోలీసులు, మరిన్ని చోరీలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అవకాశంగా మలుచుకున్న అంతర్రాష్ట్ర మహిళా దొంగలు చివరకు పోలీసుల వలలో చిక్కారు. రద్దీగా ఉండే బస్టాండ్లలో, బంగారు ఆభరణాలు ధరించిన మహిళలను లక్ష్యంగా చేసుకుని చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మహిళలను కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 30న కర్నూల్ ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కోయిలకుంట్లకు చెందిన శారదా తన భర్తతో కలిసి హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు వచ్చి, అక్కడి నుంచి కోయిలకుంట్లకు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తుండగా, ప్రయాణికుల్లా నటించిన ఇద్దరు మహిళలు బురఖాలు ధరించి ఆమెను సమీపించారు. బస్సు ఎక్కే సమయంలో ఒక మహిళ ఫుట్‌బోర్డు వద్ద నిలబడి ప్రయాణికుల రద్దీని సృష్టించగా, మరో మహిళ శారదా వద్ద ఉన్న బ్యాగ్‌లోని వాలెట్‌ను అపహరించింది. అందులో ఉన్న తొమ్మిది తులాల బంగారు ఆభరణాలను దొంగిలించి ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనపై శారదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అనుమానితుల ఆచూకీ కోసం తమిళనాడు, కర్ణాటక, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు సిబ్బందిని పంపించినప్పటికీ, మొదట్లో స్పష్టమైన సమాచారం లభించలేదు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో, దొంగతనాలు నిరోధించేందుకు నాల్గవ పట్టణ పోలీసులు కొందరు సిబ్బందిని మఫ్టీలో మోహరించారు. మూడు రోజుల క్రితం కర్నూల్ బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలను సిబ్బంది గమనించారు. మహిళా పోలీసుల సహాయంతో వారిని స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా, వారు మహారాష్ట్ర అకోలా జిల్లా కేంద్రానికి చెందిన రోజీ సుల్తానా, షేక్ రఫీకా అని తేలింది.
అకోలా పోలీసులతో సమన్వయం చేసి విచారించగా, వీరు తరచూ ఇలాంటి బాగ్ లిఫ్టింగ్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. గత ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోనూ వీరిపై దొంగతన కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్ 30న కర్నూల్ బస్టాండ్‌లో జరిగిన తొమ్మిది తులాల బంగారు ఆభరణాల చోరీ కూడా వీరే చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. చోరీ చేసిన బంగారాన్ని హైదరాబాద్ చార్మినార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించినట్లు నిందితులు వెల్లడించడంతో, ఆ సొత్తు రికవరీ కోసం ఒక ఎస్‌ఐతో పాటు ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపించారు. ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారు. అనంతరం వారిని కర్నూల్ సబ్ జైలుకు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
