మైనింగ్ శాఖలో ఉద్యోగం.. డ్యూటీ వేసి ఒక నెల జీతం కూడా ఇచ్చారు.. తీరా చూస్తే షాక్..!
మీకు ఉద్యోగం వచ్చిందంటూ అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఐడీ కార్డు జారీ చేసి బాపట్ల జిల్లాలోని ఒక మైనింగ్ క్వారీ వద్ద డ్యూటీ అని చెప్పి పంపించారు. అంతేకాదు మొదటి నెల జీతం కింద 18 వేల రూపాయలు కూడా చెల్లించారు. అంతా బాగానే ఉందనుకునే సమయంలో క్వారీ మూసి వేశారు.

మీకు ఉద్యోగం వచ్చిందంటూ అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఐడీ కార్డు జారీ చేసి బాపట్ల జిల్లాలోని ఒక మైనింగ్ క్వారీ వద్ద డ్యూటీ అని చెప్పి పంపించారు. అంతేకాదు మొదటి నెల జీతం కింద 18 వేల రూపాయలు కూడా చెల్లించారు. అంతా బాగానే ఉందనుకునే సమయంలో క్వారీ మూసి వేశారు. మీ ఉద్యోగం పోయిందని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు ఏం జరిగిందో తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఉద్యోగం పేరిట పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని గ్రహించాడు. తనను మోసం చేసిన ముఠాపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు.
బాపట్ల జిల్లా కారంచేడు మండలం జరుబులవారిపాలెంకు చెందిన మనోజ్ కుమార్ కు తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన గిరి పరిచయం అయ్యాడు. ఖాళీగా ఉన్న మనోజ్ కుమార్ తో మైనింగ్ శాఖలో ఉద్యోగం ఉన్నట్లు నమ్మబలికాడు. ఉద్యోగం వస్తే డబ్బులివ్వడానికి సిద్దమైన మనోజ్ కుమార్.. గుంటూరుకు చెందిన సూర్య కుమార్ వద్దకు తీసుకెళ్ళారు. గిరి, సూర్య కుమార్ కలిసి విజయవాడలోని శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్ళారు. ఉద్యోగం కావాలంటే పదిహేను లక్షలు చెల్లించాలని చెప్పారు. దీంతో మనోజ్ కుమార్ పదిహేను లక్షల రూపాయలను శ్రీనివాసరెడ్డికి ఇచ్చాడు.
డబ్బులు చెల్లించగానే 2024 సెప్టెంబర్ లో బాపట్లలోని మైనింగ్ కార్యాలయం వద్దకు మనోజ్ కుమార్ ను పిలిపించారు. అక్కడ నియామక పత్రాలు, ఐడి కార్డు అందించారు. బాపట్ల సమీపంలోని క్వారీలో ఉద్యోగం అని చెప్పారు. క్వారీలో నెల రోజుల ఉద్యోగానికి పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించారు. అయితే రెండో నెలలోనే క్వారీ మూసి వేశారు. దీంతో అనుమానం వచ్చిన మనోజ్ కుమార్ తన ఉద్యోగం గురించి వాకబు చేయగా నకిలీ నియామక పత్రం, ఐడి కార్డ్ ఇచ్చినట్లు తేలింది. వెంటనే శ్రీనివాసరెడ్డిని కలిసి తనను మోసం చేసిన విషయాన్ని చెప్పి తన డబ్బులు తనకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు.
దీంతో బండారం బయటపడుతుందని, శ్రీనివాసరెడ్డి పది లక్షల రూపాయలకు చెక్ రాసి మనోజ్‌కు ఇచ్చాడు. చెక్ బ్యాంక్ లో డిపాజిట్ చేయగా బౌన్స్ అయింది. మరోసారి మోసపోయినట్లు గుర్తించిన మనోజ్ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. తనను మోసం చేసిన ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. మనోజ్ కుమార్ ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
