3 ఓవర్లలో 3 వికెట్లు.. పవర్‌ప్లేలో ప్రపంచ రికార్డుతో ఉగ్రతాండవం.. ఎవరంటే?
Pakistan Pacer Shaheen Afridi world record: పాకిస్తాన్ స్టార్ బౌలర్ తన పేలవమైన ఫామ్ నుంచి కోలుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే, ఇంగ్లాండ్‌తో జరిగిన పవర్‌ప్లేలో మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి కొత్త ప్రపంచ రికార్డును కూడా సృష్టించాడు. అయితే, పాక్ జట్టు సెమీస్ నుంచి తప్పుకోవడం గమనార్హం.

Shaheen Afridi world record: పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది తన పాత ఫామ్‌కు తిరిగొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ఆరంభంలోనే ఇంగ్లాండ్‌ను షాక్‌కు గురి చేశాడు. మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి, వరల్డ్ రికార్డ్‌ను కూడా తన పేరిట రాసుకున్నాడు.
ఇంగ్లాండ్ 165 పరుగుల లక్ష్యంతో చేజింగ్‌కు దిగిన వేళ, మ్యాచ్‌కు ముందు పేలవ ఫాంతో కనిపించిన షాహీన్ అఫ్రిది, ఇంగ్లాండ్ బ్యాటర్లను క్రీజ్‌పై నిలబడటం కూడా కష్టంగా మారేలా బౌలింగ్ చేశాడు. తొలి బంతి నుంచే పాత షాహీన్ అవతారం కనిపించింది.
పవర్‌ప్లేలో 3 ఓవర్లలో 3 వికెట్లు..
సెమీఫైనల్ కలతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను పవర్‌ప్లేలోనే షాహీన్ అఫ్రిది ఛిన్నాభిన్నం చేశాడు. తొలి ఓవర్ వేసిన షాహీన్, మొదటి బంతికే ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేశాడు. టీ20 అంతర్జాతీయాల్లో తొలి బంతికే అత్యధిక వికెట్లు తీసిన రికార్డ్ ఇప్పటికే అతని పేరిట ఉంది. ఇప్పుడు ఆ రికార్డును మరింత పెంచుకున్నాడు. అంతేకాదు, టీ20 వరల్డ్ కప్‌లో తొలి ఓవర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా షాహీన్ నిలిచాడు.
రెండో ఓవర్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను పెవిలియన్‌కు పంపించాడు. మూడో ఓవర్‌ను కూడా పవర్‌ప్లేలోనే వేసిన షాహీన్, జాకబ్ బెతెల్‌ను ఔట్ చేశాడు. ఈ విధంగా పవర్‌ప్లేలో వేసిన మూడు ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ పవర్‌ప్లేలోనే కేవలం 35 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
వరల్డ్ రికార్డ్ బద్దలు..
ఇంగ్లాండ్‌పై పవర్‌ప్లేలో తీసిన మూడు వికెట్లతో షాహీన్ షా అఫ్రిది కగిసో రబాడా పేరిట ఉన్న వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. ఇప్పుడు పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షాహీన్ అఫ్రిది నిలిచాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు వరకు పవర్‌ప్లేలో షాహీన్‌కు 15 వికెట్లు ఉండగా, కగిసో రబాడా వద్ద 16 వికెట్ల రికార్డ్ ఉండేది. ఇంగ్లాండ్‌పై మూడు వికెట్లు పడగొట్టడంతో షాహీన్ పవర్‌ప్లే వికెట్ల సంఖ్య 18కి చేరింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
