వైసీపీలో చేరిన మాజీ మంత్రి.. ‘పొత్తులో ఎవరు వచ్చినా వైసీపీ గెలుపును ఆపలేరని’ వ్యాఖ్య..
మాజీ మంత్రి రావెల కిషోర్ వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పి రావెలను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఈరోజు తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన రావెల ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. పోటీకి సంబంధించిన పలు అంశాలను జగన్‌తో చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరారు.

విజయవాడ, జనవరి 31: మాజీ మంత్రి రావెల కిషోర్ వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పి రావెలను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఈరోజు తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన రావెల ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. పోటీకి సంబంధించిన పలు అంశాలను జగన్‌తో చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా జగన్ ను కలిసి, వైసీపీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. రావెల కిషోర్ బాబు ఐఏఎస్ అధికారిగా స్వచ్ఛంద విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తొలినాళ్లలో తెలుగుదేశం పార్టీలో చేరి క్యాబినెట్ బెర్త్ ను సాధించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటిపోవడంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత ఏడాది జనసేనలో చేరి ఆ తరువాత ఏపీ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో తన చూపును వైసీపీ వైపు తిప్పుకున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిన కలిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. పదవులు ఆశించి వైసీపీలోకి రాలేదన్నారు. అభివృద్ది, సంక్షేమం చూసి పార్టీలో చేరానని స్పష్టం చేశారు. టికెట్ల విషయంలో నేను ఎటువంటి షరతులు విధించలేదన్నారు. పొత్తులో ఎవరు వచ్చినా వైసీపీ గెలుపును ఆపలేరని చెప్పుకొచ్చారు. అందరినీ కలుపుకొని పార్టీలో ముందుకు వెళ్తానన్నారు. అత్యంత ఎత్తైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయటం ఒక చరిత్ర అంటూ సీఎం జగన్ను కీర్తించారు. అంబేడ్కర్ కలలను సాకారం చేసిన వ్యక్తి జగన్ అంటూ ప్రశంసించారు. రూ. 2 లక్షల 53 వేల కోట్ల నిధులను పేదల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా జమ చేయటం దేశంలోనే ఒక విప్లవమన్నారు. అన్ని పార్టీల్లో తనకు అభిమానులు ఉన్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




