జమ్మలమడుగులో ఉద్రిక్తం.. పరస్పరం రాళ్లు రువ్వుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు..

జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరు ప్రాంతంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు ఉన్నా.. వారి ముందే ఒకరికొకరు సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకున్నారు. వైసీపీ నుంచి కొంతమంది టీడీపీలో చేరుతున్నారన్న సమాచారంతోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తోంది.

జమ్మలమడుగులో ఉద్రిక్తం.. పరస్పరం రాళ్లు రువ్వుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు..
Tdp Ysrcp
Follow us
Sudhir Chappidi

| Edited By: Ravi Kiran

Updated on: Jan 31, 2024 | 4:01 PM

జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరు ప్రాంతంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు ఉన్నా.. వారి ముందే ఒకరికొకరు సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకున్నారు. వైసీపీ నుంచి కొంతమంది టీడీపీలో చేరుతున్నారన్న సమాచారంతోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తోంది.

వివరాల్లోకెళ్తే.. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమీప బంధువు శశిధర్ రెడ్డి టీడీపీలోకి చేరడమే కాకుండా.. తనతో పాటు మరికొంతమందిని టీడీపీలో చేరుస్తున్నారన్న సమాచారంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బంధువైన ముని రాజారెడ్డి.. శశిధర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని తనతో రావాలని ఎమ్మెల్యే పిలుస్తున్నారన్నారు. ఇంతలో అక్కడ ఉన్న కొంతమంది శశిధర్ రెడ్డి వర్గీయులు ఆయన్ని అడ్డుకోవడంతో అసలు గొడవ మొదలైంది. అది చినికి చినికి గాలి వానలా మారి వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య రాళ్లురువుకునేలా చేసింది. ఇంతలో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీడీపీ ఇన్‌ఛార్జ్ భూపేష్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాల వారు పోలీసులు ఉన్నా.. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఇంతలో పోలీసులు టీడీపీకి సంబంధించిన నేతలను అక్కడి నుంచి పంపించడంతో.. వారు ముద్దునూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై, ఆయన అనుచరులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన సమీప బంధువు శశిధర్ రెడ్డితో మాట్లాడి.. ఆయనకు వైసీపీ కండువా కప్పి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. కావాలనే మా కుటుంబంలో టీడీపీ వాళ్లు చిచ్చు రేపుతున్నారని.. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆదినారాయణ రెడ్డి, ఆయన సోదరులు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. గతంలో మాదిరిగా జమ్మలమడుగును ఫ్యాక్షన్ అడ్డాగా మార్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. బహిరంగంగా కొట్టుకోవాలంటే కొట్టుకుందామని ఇలా ఇళ్లల్లోకి వెళ్లి బంధువుల మధ్య చిచ్చుపెట్టడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కావాలనే వైసీపీ కార్యకర్తలను బలవంతంగా ప్రలోభపెట్టి టీడీపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని.. ఇలాంటి రాజకీయాలు మేము చేస్తే జమ్మలమడుగులో ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోవాలని సుధీర్ రెడ్డి అన్నారు. ఇలా ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటూ.. స్థానికంగా ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పారు. దీంతో వారిని సద్దుమనిగించేందుకు పోలీసులు భారీగా మోహరించారు.