Bapatla: అదీ లెక్క.. ఒక్కసారి వల వేస్తే యాభై టన్నుల చేపలు చిక్కాల్సిందే…
అది బాహుబలి వల... దానితో చేపలు పట్టాలంటే.. దాదాపు 100 మంది జాలర్లు అవసరం అవుతారు. దాన్ని సిద్దం చేయడం కూడా అంత ఈజీ టాస్క్ కాదు. కానీ ఒక్కసారి వల వేశారంటే.. టన్నుల కొద్దీ జల సంపద చేజిక్కినట్టే. ఈ వలను అరుదుగా మాత్రమే వినియోగిస్తారు జాలర్లు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...
బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరానికి ఒక ప్రత్యేకత ఉంది. పర్యాటక కేంద్రంగా సూర్యలంక బీచ్ పేరుగాంచడమే కాకుండా ఇక్కడ సీజన్ మొదట్లో లభించే మత్తి, మక్కే చేపలకు కూడా ప్రత్యేకత ఉంది. ఈ రకం చేపలను తమిళనాడు, కేరళకు ఎగుమతి చేస్తుంటారు. అయితే మత్తి, మక్కే చేపలను పట్టడానికి సూర్యలంక తీరంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ఇక్కడి మత్య్సకారులు భారీ వలను ఉపయోగించి ఈ చేపలను పడుతుంటారు. ఈ వల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం పదండి…
దాదాపు కిలో మీటర్ పొడవుండే ఈ వలను ఐలా అంటారు. ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల రూపాయల విలువుండే వలతో ఒక్కసారి వేట సాగించారంటే ఐదు టన్నుల నుండి యాభై టన్నుల చేప వలకు చిక్కుతుంది. ఈ వలను వేయడానికి ఒకేసారి వంద మంది మత్స్యకారులు అవసరమవుతారు. వీరితో పాటు వలలో చిక్కిన మత్తి, మక్కే చేపలను ఏరడానికి మరో 150 మంది కూలీలు కూడా ఉంటారు. అయితే ప్రతి రోజు ఈ వలతో వేట సాగించరు. సీజన్ ప్రారంభంలో కొద్ద రోజుల పాటు మాత్రమే వేటకు అనుకూలంగా ఉంటుంది. సముద్రంలో రెండున్నర కిలో మీటర్ల లోపలికి వెళ్లి ఈ వల వేసి వేట సాగిస్తారు. కేజీ పది నుండి ఇరవై రూపాయల ధర పలికే మక్కె మత్తి చేపలను ఎక్కువుగా కేరళ, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యాపారులే కొనుగోలు చేస్తారు.
అయితే మక్కే, మత్తే చేపలను గుర్తించడానికి మత్స్యకారులకు సీగల్స్ తోడ్పడతాయి. చేపలు వేట ప్రారంభమయ్యే సమయంలో సముద్ర తీర ప్రాంతంలో సీగల్స్ పక్షులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. సీగల్స్ తిరుగుతున్న చోటే మత్తి చేపలు విరివిగా ఉంటాయి. అలలతో పాటు ప్రయాణించే ఈ రకం చేపలు టన్నులు, టన్నులు కలిసి ఒకే చోట సముద్రంలో తిరుగుతుంటాయి. ఎప్పుడైతే అధిక సంఖ్యలో సీగల్స్ తిరుగుతుంటాయో అప్పుడు మత్స్యకారులు ఐలా వలతో వేట సాగిస్తారు. ఈ సీజన్ లో అప్పుడే సూర్యలంక సముద్ర తీరంలో వేట కొనసాగిస్తున్నారు. అయితే అంత పెద్ద ఎత్తున చేపలు వలకు దొరకడం లేదని మత్స్యకారులు అంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి