AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయినవాళ్లే వద్దని వీధిలోకి నెట్టేస్తే.. చేరదీసిన ఖాకీలు.. ఏం జరిగిందంటే..?

అసలే ఎండాకాలం.. ఆపై మిట్టమధ్యాహ్నం.. సూరీడు సుర్రుమంటూ నడినెత్తిమీద నాట్యమాడుతున్నాడు. జనం హడావిడిగా జీవిత పరుగుపందెంలో గమ్యాలకు చేరుకునేందుకు చుట్టుపక్కల ఏం జరిగినా తమకు సంబంధం లేనట్టు అటూ ఇటూ పరిగెడుతున్నారు. వీరిందరి మధ్య సమాజంతో సంబంధం లేని, ఎవరికీ పట్టని ఓ వృద్దుడు ప్లైఓవర్‌ బ్రిడ్జికింద దీనంగా పడి ఉన్నాడు.

అయినవాళ్లే వద్దని వీధిలోకి నెట్టేస్తే.. చేరదీసిన ఖాకీలు.. ఏం జరిగిందంటే..?
Police Humanily
Fairoz Baig
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 23, 2025 | 3:34 PM

Share

అసలే ఎండాకాలం.. ఆపై మిట్టమధ్యాహ్నం.. సూరీడు సుర్రుమంటూ నడినెత్తిమీద నాట్యమాడుతున్నాడు. జనం హడావిడిగా జీవిత పరుగుపందెంలో గమ్యాలకు చేరుకునేందుకు చుట్టుపక్కల ఏం జరిగినా తమకు సంబంధం లేనట్టు అటూ ఇటూ పరిగెడుతున్నారు. వీరిందరి మధ్య సమాజంతో సంబంధం లేని, ఎవరికీ పట్టని ఓ వృద్దుడు ప్లైఓవర్‌ బ్రిడ్జికింద దీనంగా పడి ఉన్నాడు. వారం రోజులుగా అన్నపానీయాలు లేవు. స్నానం చేసి ఎన్నాళ్ళయిందో..! ఎండవేడికి తట్టుకోలేక ముడుచుకుని, పడుకుని ఆపసోపాలు పడుతున్నాడు. ఆ పెద్దాయన దీనస్థితిని చూసి అటుగా వెళుతున్న ఓ ముగ్గురు మనుషులు చలించిపోయారు.

అవును వాళ్ళు నిజంగా మనుషులే, మానవత్వం నిండుగా ఉన్న మట్టిమనుషులు. చేసేది ఖాకీ ఉద్యోగమైనా మానవత్వపు పరిమణాలు వెదజల్లుతున్న తమ మనసుల్ని పిండేసే దృశ్యాన్ని చూసి చలించిపోయారు. మనుషులు కాబట్టే చలించారు. వెంటనే తమలోని మనిషిని మేల్కొలిపి అనాథలా నడిరోడ్డు పక్కన పడి ఉన్న ఆ పెద్దాయన గురించి ఆరా తీశారు. చేరదీసి సపర్యలు చేశారు.

ఒంగోలులోని పోలీస్‌ జిల్లా కార్యాలయం సమీపంలోని ఫ్లైఓవర్‌ కింద ఒంటరిగా ఎందుకున్నావని ప్రశ్నించారు. వారం రోజుల క్రితం తనను తన బంధువులే తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారని, వృద్దాప్యం కారణంగా తాను వారికి భారం అయినట్టు కన్నీళ్ళు పెట్టుకున్నారు. అన్నం తిని రోజులైందని గద్గద స్వరంతో తెలిపారు. ఆ పెద్దాయన దీనస్థితిని చూసి చలించిపోయిన ఆ ముగ్గురు మనుషులు వెంటనే ఆయనకు సపర్యలు చేశారు. ఎండ వేడిమి నుంచి ఉపసమనం కల్పించేందుకు తామే ఆయనకు బిడ్డలయ్యారు. చక్కగా తలారా స్నానం చేయించారు. ఒళ్లంతా తుడిచారు. కొత్త బట్టలు తొడిగారు. చక్కగా పక్క సిద్దం చేసి కూర్చోబెట్టారు. అన్నం తిని ఎన్నాళ్ళయిందోనన్న ఆతృతతో ఆయనకు భోజనం పెట్టారు. ఆ ముగ్గురు మనుషుల్లో ఓ అమ్మ కూడా ఉంది. వయసులో చిన్నదైనా ఆ పెద్దాయనకు అమ్మలా కొసరి కొసరి అన్నం పెట్టి ఆకలి బాధ తీర్చింది.

సపర్యలు పూర్తయిన తరువాత ఆ పెద్దాయన పూర్తి వివరాలు సేకరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఆ పెద్దాయన పేరు వెంకటేశ్వరరెడ్డి, ఊరు ప్రకాశం జిల్లాలోని పమిడిపాడు. అతని బంధువులు వారం క్రితం బైక్ పై తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోయినట్టు తెలుసుకున్నారు. ఆయనకు సంబంధించిన బంధువుల కోసం ఆరా తీస్తున్నారు.

మానవత్వం చాటుకున్న ఆ ముగ్గురు ఎవరు..?

మానవత్వం పరిమళించిన ఆ ముగ్గురు మనుషులు ఎవరో కాదు.. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయం ప్రధాన గేటు దగ్గర డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్ళు. వీరిలో హెడ్‌ కానిస్టేబుల్‌ అక్బర్‌ సాహెబ్‌, కానిస్టేబుల్‌ యోగి నారాయణ, మహిళా హోంగార్డు ఝాన్సీ ఉన్నారు. పైన ఖాకీ దుస్తులు, లోపల మానవత్వం పరిమళించిన మంచి మనుషులు.. ఒంగోలు నడిరోడ్డుపై వేలమంది అటూ ఇటూ ప్రయాణిస్తున్నా, ఎవరికీ పట్టని అనాథలా పడి ఉన్న ఆ పెద్దాయన గురించి శ్రద్ద తీసుకుని సపర్యలు చేసిన ఆ ముగ్గురు మనుషులకు శాల్యూట్‌ చేయాల్సిందే..!

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..