Farmer Woman Ankamma: పెట్టుబడి వేలల్లో.. ఆదాయం లక్షల్లో.. ఈమె ఐడియా అదుర్స్..
సహజంగా రైతులు ఒకటి లేదా రెండు రకాల కూరగాయల పంటలు మాత్రమే వేస్తారు. కానీ ఓ మహిళా రైతు మాత్రం ఒకే చోట వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అర్జిస్తున్నారు. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన రంగుల అక్కమ్మ అనే మహిళా రైతు సుమారు 30 ఏళ్లకు పైగా సాగు చేస్తున్నారు. 2016లో ఈమె జిల్లా ఉత్తమ రైతు అవార్డు కూడా అందుకున్నారు.
సహజంగా రైతులు ఒకటి లేదా రెండు రకాల కూరగాయల పంటలు మాత్రమే వేస్తారు. కానీ ఓ మహిళా రైతు మాత్రం ఒకే చోట వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అర్జిస్తున్నారు. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన రంగుల అక్కమ్మ అనే మహిళా రైతు సుమారు 30 ఏళ్లకు పైగా సాగు చేస్తున్నారు. 2016లో ఈమె జిల్లా ఉత్తమ రైతు అవార్డు కూడా అందుకున్నారు. ప్రస్తుతానికి ఈమెకున్న సొంత ఎకరా స్థలంలో బీర, ఆనప, దొండ, బెండ, క్యాబేజీ, ఉల్లి, మిరప వంటి కూరగాయలతో పాటు తోటకూర, పాలకూర, చుక్కకూరలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. అంతేకాకుండా ఎకరా స్థలం గట్టు పై అరటి, మునగ, బంతి మొక్కలు కూడా వేశారు. ఇవన్నీ పండించేందుకు ముందుగా నీటి సౌకర్యం కోసం కావల్సిన నీటి బోరును తన పొలంలో ఏర్పాటు చేసుకున్నారు. బలవర్ధకమైన ఎరువుల కోసం వర్మీ కంపోస్ట్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు.
ఆ యూనిట్లో సొంతంగానే ఎరువులు, వేపపిండి, కాగుపిండి, ఆవు మూత్రం, పంచగవ్యం తయారుచేసి పంటలకు పిచికారీ చేశారు. ఆకుకూరలు, కూరగాయల పెంపకం కోసం బయట నారు కొనుగోలు చేస్తే కల్తీ నారు బారిన పడే ఆవకాశం ఉండటంతో అలా కొనుగోలు చేయకుండా ఈమె సొంతగా నారు పెంచుకున్నారు. తీగ జాతి కూరగాయల కోసం ముందుగా తన స్థలంలో యాభై వేలు ఖర్చు చేసి శాశ్వత ప్రాతిపదికన సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన స్తంభాలకు తీగజాతి అయిన బీర, ఆనప, దొండ తీగలు అల్లించారు. ఆ తరువాత అందులో అంతర పంటగా బంతి పెంచుతున్నారు. ఇలా పండిస్తున్న పంటల్లో కూరగాయలు, ఆకుకూరలు, బంతి నుండి అధిక లాభాలు అర్జిస్తున్నారు. కూరగాయల ప్రకారం చూస్తే ఈ ఏడాది బీర విత్తనాలకు పదిహేను వందలు, పురుగు మందులు, ఎరువులకు ఐదు వేలు, కలుపుతీతకు వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తే మొత్తం పెట్టుబడి పోగా సుమారు యాభై వేల లాభం వచ్చినట్లు చెప్తున్నారు అక్కమ్మ.
అలాగే ఇరవై సెంట్లలో వంగ విత్తనాలకు రెండు వేలు, ఎరువులు, పురుగు మందులకు 10 వేలు, కూలీలకు మూడు వేలు ఖర్చు చేయగా.. ఇప్పటి వరకు వంకాయల విక్రయాలపై 80 వేల వరకు ఆదాయం వచ్చిందని చెబుతున్నారు. అలాగే ఆనపలో విత్తనాలు, కూలీ ఖర్చు కలిపి ఐదు వేలు వరకు ఖర్చు చేసి పెంచగా.. 20 వేల వరకు ఆదాయం వచ్చినట్లు వివరించారు. ఇలా అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, అంతర పంటగా సాగు చేస్తున్న బంతితో పాటు ఇతర అనేక రకాల సాగుతో అక్కమ్మ అధిక లాభాలు గణిస్తున్నారు. ఈ విధంగా ఏటా 50 వేలు ఖర్చు చేసి మూడు లక్షల వరకు ఆదాయం పొందుతున్నట్లు చెప్పారు ఈ ఆదర్శ రైతు. అదును, పదును, సీజన్లు చూసుకొని చిన్నపాటి మెలుకువలతో సాగు చేస్తే రైతులు సిరులు పండించవచ్చని ఈ మహిళ రైతు అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..