Andhra: ఈమె గుర్తున్నారా.. ఇప్పుడు తన ఇంట్లో పెంచిన అరటి చెట్టు కారణంగా వార్తల్లోకి
నన్నపనేని రాజకుమారి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఫేమస్ వ్యక్తి.. అన్న ఎన్టీఆర్ టైం నుంచి ఆమె రాజకీయాల్లో ఉన్నారు. అటు టీడీపీ, కాంగ్రెస్‌ల హయాంలలో కీలక పదవుల్లో కొనసాగారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ.. కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే పెరట్లోని ఓ అరటి మొక్క ఇప్పుడు ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది.

నన్నపనేని రాజకుమారి… రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు… ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఉమెన్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పనిచేసి రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే వయసు సహకరించకపోవడంతో.. ఆమె ప్రస్తుతం రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాజకుమారి ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
రాజకుమారి కట్టు, బొట్టు ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రత్యేక ఆహార్యంతో ఆమె గుర్తింపు పొందారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రాజకుమారి తన సొంత గార్డెన్‌లో వివిధ రకాల పూల, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఇందులో భాగంగా నాదేండ్ అరటి మొక్కలకు నాటారు. అయితే ఈ మధ్య కాలంలో కాపుకొచ్చిన అరటి.. గెల వేసింది. అయితే ఈ గెల అసాధారణ స్థాయిలో ఉంది. సాధారణంగా నాదేండ్ చెట్టుకి వచ్చే అరటి గెలకు నాలుగైదు హస్తాలకు మించి ఉండవు. అలాగే అరటి కాయలు కూడా యాభై అరవైకి మించవు. కాని ఇక్కడ వచ్చిన గెలకు ఏకంగా పదిహేను హస్తాలున్నాయి. కాయలు కూడా 150 వరకూ ఉన్నాయి. దీంతో ఆ అరటి గెలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
రాజకుమారి మాత్రం పూర్తిగా ఆర్గానిక్ విధానంలో అరటి మొక్కను పెంచినట్లు చెప్పారు. రసాయన ఎరువులు ఉపయోగించడం లేదన్నారు. మొక్క బలంగా పెరగడానికి సాధారణ ఎరువులనే వేసినట్లు చెప్పారు. తమ ఇంటిలో అరటి గెలకు పదిహేను హస్తాలు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంటికి వచ్చిన వారు కూడా అరటి చెట్టును ఆసక్తిగా తిలకిస్తున్నట్లు చెప్పారు. కాసిన అరటి పండ్లు రుచిగా కూడా ఉంటాయన్నారు. కాయలు మాగి పండు అయ్యే వరకూ చెట్టుకే ఉంచుతామని దీంతో మంచి రుచి వస్తుందని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




