Success Story: 7 ప్రభుత్వ ఉద్యోగాలు వదులుకున్న యువకుడు.. నిరంతర ప్రయత్నంతో అనుకున్నది సాధించాడు
ఎస్సై ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. పట్టుదలతో ముందుకు సాగారు. ఈ క్రమంలోనే వచ్చిన ఒకటి, రెండు కాదు ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకొని గమ్యం వైపు అడుగులు వేశారు. చివరికి ఎనిమిదవ సారి ఎస్ఐ ఉద్యోగం కొట్టి అనుకున్నది సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
ఎస్సై ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. పట్టుదలతో ముందుకు సాగారు. ఈ క్రమంలోనే వచ్చిన ఒకటి, రెండు కాదు ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకొని గమ్యం వైపు అడుగులు వేశారు. చివరికి ఎనిమిదవ సారి ఎస్ఐ ఉద్యోగం కొట్టి అనుకున్నది సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఇదే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయనగరం జిల్లా గరివిడి మండలం ఏనుగువలసకు చెందిన వెంపడాపు ఈశ్వరరావు తాజాగా విడుదలైన ఎస్సై పరీక్షల్లో ఎంపికయ్యారు.
ఈశ్వరరావు నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు. తల్లిదండ్రులు వెంపడాపు కృష్ణ, నరసమ్మ ఎంతో కష్టపడి ఈశ్వరరావును చదివించారు. పేదరికం కారణంగా ఇతని చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది. ఈశ్వరరావుకు చిన్నతనం నుండి ఎస్సై ఉద్యోగం సాధించాలని బలమైన కోరిక. అందుకోసం ఎంతో కష్టపడి చదివాడు. ఎన్నోసార్లు ఎస్సై పరీక్షకు కూడా హాజరయ్యారు. అయినా ఫలితం దక్కేది కాదు. అయితే తాను అనుకున్న ఉద్యోగం రాలేదని ఎప్పుడూ నిరాశ చెందలేదు. బలమైన సంకల్పంతోనే ముందుకు సాగారు. తల్లిదండ్రులు కూడా ఈశ్వరరావును ప్రోత్సహిస్తూ పొలం పనులు చేసుకుంటూ కాయకష్టంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు.
ఈ క్రమంలోనే తండ్రి పక్షవాతంతో మంచాన పడ్డారు. సుమారు ఐదేళ్ల పాటు లేవలేని స్థితిలో ఉండిపోయారు. దీంతో ఓ వైపు కుటుంబానికి ఆసరాగా నిలుస్తూనే, మరోవైపు తన చదువును కొనసాగించారు ఈశ్వర్ రావు. డిగ్రీ పూర్తయిన తరువాత ఏం చేయాలో తోచక తన గ్రామంలోనే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యారు. అయితే అక్కడ వచ్చే చాలీ చాలని జీతంతో గడపలేక తనకు దగ్గరలో ఉన్న ఒక ఫార్మా కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు. ఫార్మాలో ఉద్యోగం అయితే చేస్తున్నాడు కానీ తాను అనుకున్న ఎస్ఐ ఉద్యోగం మాత్రం పొందలేదన్న భాధ మనసును భాధ పెడుతుండేది.
ఈ నేపథ్యంలోనే ఎలాగైనా లక్ష్యం చేరుకోవాలని కాకినాడలో ఒక కోచింగ్ సెంటర్లో చేరారు. అలా కోచింగ్ తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు చూసి పరీక్షలు రాస్తుండేవారు. అలా రాయగా వచ్చిన ఉద్యోగాల్లో మొదట ఎస్ఎస్సీఎంటీఎస్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత అదే ఏడాది గ్రూప్ డి కేటగిరిలో రైల్వే గ్రౌండ్ పాయింట్ మెన్‌గా సెలెక్ట్ అయ్యారు. ఆ తరువాత గుంటూరు డివిజన్లో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డ్ సచివాలయంలో శానిటరీ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. అయితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అవేవీ ఈశ్వరరావుకు నచ్చేవి కావు. తాను అనుకున్న ఎస్సై ఉద్యోగం మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని సాధన చేసేవారు.
ఈ క్రమంలోనే 2023లో రైల్వే ట్రైన్ మేనేజర్ ఉద్యోగాన్ని కూడా సంపాదించారు. అయితే ఎస్సై ఉద్యోగం పొందే వరకు ఏ ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకుని ట్రైన్ మేనేజర్ ఉద్యోగాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. చేసేది లేక ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి మళ్లీ ఎస్సై ఉద్యోగం కోసం ప్రయత్నించారు. దీంతో ఎట్టకేలకు ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఎస్సై ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎంతో కష్టపడి తన కొడుకు జీవితాశయంగా పెట్టుకున్న ఎస్ఐ ఉద్యోగం దక్కడంతో అతని తల్లిదండ్రుల కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి. తాను అనుకున్న ఉద్యోగాన్ని పొందేందుకు తన కాళ్ల ముంగిటకు వచ్చిన ఏడు ఉద్యోగాలను వదులుకొని చివరకు ఎస్ఐ ఉద్యోగం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు ఈశ్వర్ రావు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..