ఏపీ రాజకీయాల్లో మళ్లీ సౌండిస్తున్న ప్రశాంత్ కిశోర్.. పీకే కెరీర్‌గ్రాఫ్‌ ప్రోగ్రెస్ ఏంటి?

ప్రశాంత్ కిషోర్.. ఏపీ రాజకీయాల్లో చాలా గ్యాప్ తర్వాత మళ్లీ బ్యానర్ వార్తగా మారారు. చెయ్యితిరిగిన రాజకీయ వ్యూహకర్తగా పేరున్న పీకే.. ఈసారి మాత్రం గ్రే షేడ్స్‌లో కనిపిస్తున్నారు. మొన్నటిదాకా అఖండ విజయాలకు దారిచూపే దిక్సూచి. ఇప్పుడైతే ఆయనకు అంత సీనుందా అనే అనుమానపు చూపులు. దీనిక్కారణం... ఆయన తరచూ తీసుకునే యూటర్న్‌లేనా.. లేక మరొకటేదైనా ఉందా అంటూ.. జర్నీ ఆఫ్ ప్రశాంత్ కిషోర్‌ని రీకాల్ చేసుకుంటోంది తెలుగు జనాభా.

ఏపీ రాజకీయాల్లో మళ్లీ సౌండిస్తున్న ప్రశాంత్ కిశోర్..  పీకే కెరీర్‌గ్రాఫ్‌ ప్రోగ్రెస్ ఏంటి?
Prashant Kishor
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 24, 2023 | 8:59 PM

రాజకీయ వ్యూహకర్తగా, విక్టరీ సింబల్‌కి మారుపేరుగా ప్రశాంత్ కిశోర్‌ది ఒక చరిత్ర. మేరే పాస్ పీకే హై అంటూ రాజకీయ పార్టీలన్నీ రొమ్ములు విరుచుకుని తిరిగే రోజులు ఒకప్పటివి. చిన్న ఇంటర్వెల్ తీసుకుని తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడు మళ్లీ మోతెక్కిపోతోంది పీకే మార్క్ ఆఫ్ సౌండ్. రాజకీయాల్లో హీరోల్ని జీరోలుగా మార్చాలన్నా, జీరోల్ని హీరోలుగా చూపాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా. కటౌట్‌ని చూసి కొన్నికొన్ని నమ్మెయ్యాలి డూడ్‌ అనేంతగా ఉంటాయి ఆయనిచ్చే ఎలివేషన్ సీన్లు. సోషల్ మీడియాను బలంగా వాడుకోవడం, సమయానికి తగు పాచికలు వేసి.. ప్రతిపక్షంలోంచి పవర్లోకొచ్చే మార్గాల్ని సులభతరం చేయడం… ఇదే టీమ్ ఆఫ్ పీకే చేసే డ్యూటీ.

సంప్రదాయ రాజకీయాలకు కార్పొరేట్ రంగులద్ది, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనే కొత్త ప్రొఫెషన్‌ని సృష్టించుకుని చెలరేగిపోయిన శాల్తీ ప్రశాంత్ కిషోర్. జాతీయస్థాయిలో బీజేపీకి పనిచేసి… 2014లో మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన క్రెడిట్ ప్రశాంత్ కిశోర్‌ బ్రాండ్ వ్యాల్యూని అమాంతం పెంచేసింది. తర్వాత బెంగాల్‌లో అదే బీజేపీకి వ్యతిరేకంగా మారి.. తృణమూల్‌ కాంగ్రెస్‌కి బ్యాక్‌డోర్ పాలిటిక్స్ షురూ చేసి.. మమతాబెనర్జీ కుర్చీని పదిలం చేశారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌కి, తమిళనాట డీఎంకే చీఫ్ స్టాలిన్‌కి సైతం గట్టిగానే వర్కవుటైంది పీకే ఫార్ములా. మొత్తం 12 రాష్ట్రాలకు పనిచేసిన అపారమైన అనుభవం ప్రశాంత్ కిశోర్‌ది. తెలుగురాష్ట్రాల్లో కూడా ప్రశాంత్ కిశోర్ ముద్ర గట్టిగానే పడింది. ఆరేళ్ల కిందట వైసీపీ ప్లీనరీలో అమరావతి వేదికగా ప్రశాంత్ కిశోర్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి పరిచయం చేశారు అప్పటి విపక్ష నేత జగన్.

‘రావాలి జగన్, కావాలి జగన్’ అనే థీమ్ స్లోగన్‌తో జగన్‌ కటౌట్ సైజుల్ని పెంచి.. తనదైన వ్యూహాలతో బ్లాక్‌బస్టర్ విక్టరీనిచ్చిన పీకే.. ఏపీలో హాట్‌ క్యారెక్టర్‌గా మారిపోయారు. తమ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అతడేనంటూ కత్తిగట్టింది ప్రతిపక్ష తెలుగుదేశం. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ ములాఖత్.. తాజా బిగ్ బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబైనా, ప్రశాంత్ కిషోరైనా ఇంత పెద్ద యూటర్న్ తీసుకుంటారని ఎవ్వరూ అనుకోలేదు. అందుకే.. పీకే రీఎంట్రీ వార్త… ఏపీలో రెండు ప్రధాన రాజకీయ శిబిరాలకూ షాకిచ్చింది. గతంలో… తిరుమలేశుడి నుంచి పింక్ డైమండ్ చంద్రబాబే దొంగలించారని ఆరోపించడం, విశాఖపట్నం ఏర్‌పోర్ట్‌లో జరిగిన కోడికత్తి ఎపిసోడ్‌లో బాబును దోషిగా చూపడం.. ఐపీఎస్‌ల బదలీలో కమ్మ కోణాన్ని ఎక్స్‌పోజ్ చేయడం.. ఇవన్నీ జగన్‌కి ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన ఐడియాలేనని టీడీపీ గట్టిగా నమ్మింది. అందుకే పీకేని నిన్నటిదాకా శత్రువుగానే చూసింది తెలుగుదేశం క్యాడర్. నాడు బందిపోటు, నేడు ఆపద్బాంధవుడు ఎలా అయ్యాడు అంటూ వైసీపీ వర్గీయులే కాదు.. విశ్లేషకులు, మధ్యేవాదులు సైతం విమర్శలందుకున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు మరొక సలహాదారు అవసరమా.. అనే ఎద్దేవాలు కూడా వినిపిస్తున్నాయి.

ఒకప్పుడు పీకేపై తిట్ల వర్షం కురిపించిన టీడీపీ… ఇప్పుడు మళ్లీ పీకేనే ఆశ్రయించడంతో విమర్శలందుకుంది వైసీపీ. ఎంతమంది పీకేలొచ్చినా పీకేదేమీ లేదని ఒకరు.. బీహారీ డెకాయిట్‌ అంటూ చాకిరేవు పెట్టిన మీరే ఆ బీహారీ డెకాయిట్‌నే చంకనెక్కించుకున్నారేం అంటూ కౌంటర్లు భారీగానే పడ్డాయి. నిజానికి జగన్ గెలిపించిన తర్వాత ప్రశాంత్‌ జర్నీ చాలా మలుపులు తిరిగింది. వ్యూహకర్త వృత్తిలో ఇకపై కొనసాగను అంటూ 2021 మేలో రిటైర్మెంట్ ప్రకటించారు. తన ఐప్యాక్‌ సంస్థను కొలీగ్ రిష్‌రాజ్‌ సింగ్‌ చేతికిచ్చి, ఐప్యాక్ డైరెక్టర్ పోస్టునుంచి కూడా తప్పుకున్నారు. కింగ్‌మేకర్‌ని కాదు.. నేనే కింగుని ఎందుక్కాకూడదు అంటూ క్రియాశీల రాజకీయాల్లో దూరిపోయారు. సొంత రాష్ట్రం బీహార్‌కెళ్లి నితీష్‌కుమార్ పార్టీలో చేరిపోయారు. అక్కడా నిలదొక్కుకోలేక సస్పెన్షన్‌కు గురై జన్‌సురాజ్ పేరుతో సొంతంగా ఒక పార్టీయే పెట్టబోయారు. బీహార్‌లో 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని కూడా ప్రకటించారు. కానీ.. ప్రాక్టికల్‌గా ఏదీ వర్కవుట్ కాక.. మళ్లీ పాత ప్రొఫెషన్‌లోకే దిగిపోయారా.. అని టాక్ నడుస్తుంది

ఇటీవల పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన గులాబీ బాస్ కేసీఆర్ కూడా.. ప్రశాంత్ కిశోర్‌ నుంచి టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నారు. ఆయన దేశం గురించి ఆలోచించే మనిషి.. నాలాగే మార్పు కోసం తపించే వ్యక్తి.. పైగా నాకు ప్రియమిత్రుడు.. అని సగర్వంగా ప్రకటించుకున్నారు కేసీఆర్. పన్లోపనిగా… పైసలు తీసుకుని పనిచేసే రకం కాదు అంటూ పీకేకి పెద్ద కాంప్లిమెంటే ఇచ్చారు కేసీఆర్.

తర్వాత కేసీఆర్‌తో పీకే డీల్ రద్దు చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఒక్కో పార్టీ నుంచి వందల కోట్లు తీసుకుంటారనే ప్రచారంలో నిజమెంతో తెలీదుగాని… ప్రశాంత్‌ కిషోర్ ఒక తిరుగులేని బ్రాండ్‌గా మారడమైతే నిజం. గెలిచే పార్టీల పంచన చేరి తన వ్యూహాలతోనే వారిని గెలిపించినట్టు కలరింగ్ ఇస్తారని పీకే మీద విమర్శలు కూడా లేకపోలేదు. తనకుతాను గొప్ప రాజకీయ వ్యూహకర్తగా ప్రకటించుకున్న పీకే, సొంతంగా పార్టీ పెట్టి రాణించలేక బొక్కబోర్లా పడ్డారెందుకు అనే సందేహాలు మరొకవైపు. ఇలా ప్రశాంత్ కిశోర్ కమిట్‌మెంట్ మీద, ప్రశాంత్ కిషోర్ బ్రాండ్ మీద మరకలు పడ్డ నేపథ్యంలో జర్నీని రీస్టార్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం-జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్‌గా పనిచేసి, ఏపీలో మరో సంచలనానికి తెరతియ్యబోతున్నారా లేక.. ఆయనే ఆన్నట్టు చంద్రబాబుతో ఇది మర్యాదపూర్వకంగానే భేటీ మాత్రమేనా.. పీకేకి వాట్ నెక్ట్స్..? ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు