Andhra Pradesh: రూ.2 కోట్ల బంగారంతో కారులో సొంతూరుకు.. కట్ చేస్తే.. కాలువలో శవమై కనిపించాడు.. అసలు ఏం జరిగిందంటే..?
ఏపీలో సంచలనం సృష్టించిన బంగారం వ్యాపారి మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. డ్రైవర్ చేతిలోనే అతడు దారుణ హత్యకు గురయ్యాడు. 10 రోజుల తర్వాత ఎట్టకేలకు అతడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయగా.. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకి చెందిన గోల్డ్ వ్యాపారి వెంకట పార్వతీశం గుప్తా మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. పోలీసులు దర్యాప్తులో హత్యకు గురైనట్లు తేలింది. రెండు కోట్ల రూపాయల విలువైన బంగారం కోసం అతన్ని సొంత డ్రైవరే పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. గత నెల 26న బంగారం కొనుగోలు నిమిత్తం గుప్తా తన డ్రైవర్ సంతోష్‌తో కలిసి కారులో విశాఖకు బయలుదేరారు. విశాఖలో రూ. 2 కోట్ల విలువ చేసే బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి తిరిగి నరసన్నపేటకు బయలుదేరారు. అదే రోజు రాత్రి నరసన్నపేట చేరుకున్న సంతోష్, తన యజమాని గుప్తా శ్రీకాకుళంలో ఉండిపోయారని, తనను వెళ్ళిపొమ్మని చెప్పారని గుప్తా కుటుంబసభ్యులకు చెప్పాడు. మొదట వారు ఈ మాటలు నమ్మారు. అయితే గుప్తా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అతనికి ఫోన్ చేయగా, ఫోన్ బస్సులో దొరికినట్లు ఒక వ్యక్తి వారికి తిరిగి ఇచ్చాడు. దీంతో అనుమానం పెరిగి, నాలుగు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హత్య వెనుక కుట్ర
గుప్తా అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టోల్ గేట్ల వద్ద కారు ఫుటేజ్‌లు, సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. దీంతో గుప్తా ప్రయాణించిన కారు పెద్దపాడు వరకు వచ్చినట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు, డ్రైవర్ సంతోష్‌తో పాటు అతని స్నేహితులైన రాజు, మణికంఠలను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. బంగారాన్ని కాజేయాలనే దురాశతో డ్రైవర్ సంతోష్ పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. విశాఖ నుండి తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం శివారులోని పెద్దపాడు వద్ద కారులో సాంకేతిక లోపం వచ్చిందని చెప్పి, ఒక పాల కేంద్రం వద్దకు కారును మళ్లించాడు. అక్కడ సంతోష్‌తో కలిసి గుప్తాను హత్య చేసి బంగారాన్ని దోచుకున్నట్లు రాజు, మణికంఠాలు అంగీకరించారు.
హత్య అనంతరం, ఎవరికీ అనుమానం రాకుండా గుప్తా మృతదేహాన్ని పెద్దపాడు – శ్రీకాకుళం మధ్య ఒక కాలువలో పడేశారు. బంగారం కాజేసిన తర్వాత, అందులో 14 గ్రాములను నరసన్నపేటలోని ఒక బంగారు షాపు యజమాని వద్ద తాకట్టు పెట్టి లక్షా 40 వేల రూపాయలు తీసుకుని సంతోష్ తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రెండు రోజులు గాలించగా, శుక్రవారం మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం సంతోష్, రాజు, మణికంఠలను పోలీసులు అదుపులోకి తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనేది, కాజేసిన బంగారాన్ని ఎక్కడ దాచారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసు త్వరలోనే పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
