Andhra: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మంతెన.. కేబినెట్ హోదా.. జీతం ఎంత..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు యోగా, ప్రకృతి వైద్య ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. అయితే, ఆయన క్యాబినెట్ హోదాకు సంబంధించిన ఎలాంటి జీతం, భత్యాలు, ప్రభుత్వ సదుపాయాలు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నారు. తన 35 ఏళ్ల సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజల సొమ్ము తీసుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

గత ఏడాది డిసెంబరు నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రముఖ యోగా, ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ఆహ్వానించి పావుగంట సేపు మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి డాక్టర్ మంతెన 35 సంవత్సరాల సేవలను ప్రశంసించారు. తెలుగు ప్రజలకు ప్రివెంటివ్ హెల్త్, యోగా, నాచురోపతి రంగాలలో ఆయన అందించిన అపారమైన సేవలను, అనుభవాన్ని ముఖ్యమంత్రి గుర్తించారు. ప్రజలకు ఆరోగ్యాన్ని మరింతగా అందించాలంటే ఈ విధానాల ఆవశ్యకత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి సంజీవని ప్రాజెక్టు వంటి అనేక ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తోందని, ఈ ప్రయత్నంలో డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు లాంటి నిపుణుల సలహాలు, సూచనలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అందువల్ల, యోగా, నాచురోపతి విభాగం నుంచి ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించాలని ఆయన డాక్టర్ రాజును ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనకు డాక్టర్ రాజు కృతజ్ఞతలు తెలుపుతూ, మొదట తాను ఎప్పుడూ ఏ హోదాలు, పోస్టులు తీసుకోకూడదనే నియమాన్ని పెట్టుకున్నానని వివరించారు. తాను వెనుక ఉండి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందిస్తానని, ప్రభుత్వ సహకారం ఉంటే తాను చేస్తున్న పనికి రెట్టింపు ఉత్సాహంతో, ఎక్కువ సమయాన్ని కేటాయించి సేవ చేస్తానని పేర్కొన్నారు. అయితే, హోదా లేకపోతే మాటలకు గౌరవం ఉండదని, ఆచరణలోకి వెళ్లదని, పదవిలో ఉండి చెబితే అమలుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ముఖ్యమంత్రి వివరించారు. దీనివల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి నచ్చజెప్పారు.
ముఖ్యమంత్రి వాదనతో డాక్టర్ రాజు ఒక శరతు విధించారు. తాను సలహాదారుగా ఉండాలంటే, క్యాబినెట్ హోదాతో వచ్చే ఏ సదుపాయాలనూ తాను తీసుకోనని స్పష్టం చేశారు. ఇందులో నెల జీతం, ప్రభుత్వ కారు, ఇతర ఖర్చులు, ఇంట్లో సహాయకుల జీతాలు, విమాన, రైలు టిక్కెట్లు, కార్యాలయ సదుపాయాలు వంటివి ఏవీ స్వీకరించనని వివరించారు. తన 35 ఏళ్ల జీవితంలో ఎవరి నుంచీ ఒక రూపాయి గానీ, వస్తువు గానీ, బహుమతి గానీ, ప్రయాణ టిక్కెట్లు గానీ తీసుకోలేదని, చివరికి తన తల్లిదండ్రుల ఆస్తిలో ఒక్క సెంటు భూమిని కూడా తీసుకోలేదని ఆయన ముఖ్యమంత్రికి తెలియజేశారు. కష్టపడకుండా సంపాదించిన ఆస్తిని తీసుకోవడం దోషం అనే నియమం తనకు ఉందని, ఈ రోజుకీ తనకు బ్యాంకు అకౌంట్, ఏటీఎం కార్డు, పాన్ కార్డు లేవని స్పష్టం చేశారు. ప్రశాంతంగా, ఆనందంగా జీవించడానికి కొన్ని ప్రిన్సిపల్స్‌ను నమ్ముకున్నానని, ప్రభుత్వ సలహాదారుగా ఉండి ప్రజల సొమ్మును తీసుకోవడం అంటే తాను పాపం చేసినట్లేనని, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బు ప్రజలదేనని డాక్టర్ రాజు వాదించారు. తాను తన సంస్థ నుంచి కూడా జీతం తీసుకోనని, సొంత డబ్బుతోనే ఖర్చులు భరిస్తానని తెలిపారు. తన మనోభావాలను గౌరవిస్తూ తాను చెప్పిన షరతులకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఈ నిర్ణయంతో డాక్టర్ రాజు తన 35 ఏళ్ల కృషికి ప్రభుత్వం తోడవడంతో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
యోగా, ప్రకృతి వైద్య విధానాలు అనేవి జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి, మంచి అలవాట్లు నేర్పడానికి గొప్ప విద్య అని తాను 35 సంవత్సరాల క్రితమే గ్రహించానని, భవిష్యత్తు అంతా దీనిపైనే ఉంటుందని నమ్మినట్లు తెలిపారు. గతంలో ఫార్మసీ చదువుకున్నా, మందుల కంటే ఈ విధానాలే మేలైనవని గ్రహించి ఒంటరిగా కృషి చేశానని, ఇప్పుడు ప్రభుత్వ సహకారంతో మరింత మందికి చేరవేయగలనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరికీ – పిల్లల నుంచి పెద్దల వరకు, పేదల నుండి ధనికుల వరకు – జబ్బులు తగ్గించుకోవడానికి, మందుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి, హాస్పిటల్ బిల్లులు తగ్గించుకోవడానికి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని నేర్చుకోవడానికి, మంచి అలవాట్లు పెంచుకోవడానికి సహాయపడనున్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో నాచురోపతి కాలేజీలు, హాస్పిటల్స్ మరింత పెరగడానికి కృషి చేస్తామని డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు. తన ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కాగా మంతెన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగనున్నారు.
అసలు కేబినెట్ హోదా ఉంటే జీతభత్యాలు ఎంత ఉంటాయి..?
కేబినెట్ హోదా కలిగిన వ్యక్తులకు రూ.2 లక్షల వరకూ జీతం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇవి కాకుండా పీఏ, పీఎస్, ఓఎస్, డ్రైవర్ జీతాల కింద రూ.70 వేలు, వెహికల్ అలవెన్సుల కింద రూ.60 వేలు, మొబైల్ ఫోన్ డేటా కనెక్షన్ నిమిత్తం రూ.500, ప్రయాణాల నిమిత్తం ఇంటర్నేషనల్ అయితే బిజినెస్ క్లాస్, దేశీయంగా విమానాలు, రైలులో తిరిగేందుకు అలవెన్సులతో కలిపి రూ.4.50 లక్షల వరకూ ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
