Markapuram: జనావాసాల్లోకి అరుదైన అతిథి.. ఎప్పుడో బ్రిటీష్ పాలనలో కనిపించకుండా పోయి..
150 ఏళ్ల తరువాత నల్లమల అడవుల్లోకి తిరిగి వచ్చిన అరుదైన అడవి దున్న.. ఇప్పుడు గ్రామాల అంచులకు చేరింది. తర్లుపాడు మండలం బోడిచెర్లలో అడవి నుంచి దారితప్పి వచ్చిన బలిష్టమైన అడవి దున్న కలకలం రేపింది. జీవ వైవిధ్యానికి శుభ సంకేతమా? లేక గ్రామాలకు కొత్త సవాలా?

మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలో అడవి దున్న ప్రతక్షమైంది. బోడిచెర్ల గ్రామంలో అడవి నుంచి దారితప్పి వచ్చిన ఓ బలిష్టమైన అడవి దున్న కలకలం రేపింది. బలమైన శరీరం, చురుకైన కదలికలతో గ్రామంలో సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాగా బలిష్టంగా ఉండి కాళ్లు తెల్లగా ఉండడంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్థులు. గ్రామస్థులు భయపడి కేకలు వేస్తుండటంతో సమీపంలోని పొలాల్లోకి పారిపోయింది అడవి దున్న. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారి సిబ్బందితో గ్రామానికి చేరుకొని ప్రజలతో మాట్లాడారు. అడవి దున్నకు హాని కలిగించే పనులు చేయరాదన్నారు కౌన్సిలింగ్ ఇచ్చారు. జంతువు నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు…
ఏమిటీ అడవిదున్న ప్రత్యేకత…
జీవ వైవిధ్యానికి పేరెన్నికగన్న నల్లమల అటవీ ప్రాంతంలో 150 ఏళ్ల క్రితం అదృశ్యమైపోయాయి అడవిదున్నలు… తిరిగి ఏడాది కాలంగా నల్లమల అడవిలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. బలిష్టమైన శరీరం, కాళ్ల దగ్గర ప్రత్యేకంగా బూట్లు వేసుకున్నట్టు తెల్లటి చర్మంతో ఉండే ఈ అడవిదున్నలను మహిషం అని కూడా అంటారు. ఎప్పుడో 1870లో బ్రిటీషర్ల పరిపాలనలో నల్లమల అడవుల నుంచి కనిపించకుండా పోయిన ఈ అడవిదున్నలు ఏడాది క్రితం నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఇటీవల కాలంలో తొలిసారి కనిపించాయి. ఈ అడవిదున్నలు కర్ణాటక రాష్ట్రంలోని అటవీప్రాంతం నుంచి కృష్ణా నదిని దాటుకుంటూ నల్లమల అడవిలోకి ప్రవేశించి ఉంటాయని భావిస్తున్నారు. ఇండియన్ బైసన్‌గా, మహిషంగా ఈ అడవి దున్నలను పిలుస్తారు. నల్లమలలో ఒకప్పుడు విరివిగా కనిపించే ఈ అడవిదున్నలు కాలనుగుణంగా అంతరించిపోయాయి… నల్లమలలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇవి ఇక్కడి నుంచి కర్నాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలకు వలస వెళ్లి ఉంటాయని ఓ అంచనా… తిరిగి 150 ఏళ్ల తరువాత తిరిగి ఇవి పశ్చిమ కనుమల నుంచి తిరిగి నల్లమలకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు… నల్లమలలో వీటి సంచారం కారణంగా జీవవైవిధ్యం వెల్లివిరుస్తుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు… ఇలాంటి అరుదైన అడవి జంతువులు గ్రామాల్లోకి వస్తే వాటికి హాని కలిగించేలా ప్రవర్తించవద్దని అటవీ సిబ్బంది సూచిస్తున్నారు.
