Hyderabad: అదుపులోకి రాని నాంపల్లి అగ్ని ప్రమాదం.. 20 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
200మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగుతున్నా.. ఫైర్ సిబ్బంది రెస్క్యూకి దట్టమైన పొగ తీవ్ర అడ్డంకిగా మారింది. ఒక్క మనిషి నడిచేంత స్థలం తప్ప సెల్లార్ లోకి వెళ్లటానికి దారి లేదు. దీంతో మొదటి సెల్లార్లోకే వెళ్లలేక ఎంట్రీ దగ్గరే ఆగిపోతున్నారు సిబ్బంది. పక్క బిల్డింగ్ సెల్లార్ ద్వారా గోడను పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉన్న నాంపల్లి అగ్నిప్రమాద ఘటనా స్థలంలో గంటలు గంటలుగా రెస్క్యూ కొనసాగుతోంది. వివిధ రకాల రెస్క్యూ టీమ్‌లు నాన్‌స్టాప్‌గా శ్రమిస్తున్నాయి. అయితే.. మంటలు అదుపులోకి వచ్చినా.. దట్టమైన పొగ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. రెస్క్యూ టీమ్‌లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దశల వారీగా పెద్దయెత్తున పొగ కమ్మేస్తోంది. అటు.. లోపల ఎంతమంది ఉన్నారనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి లోపల ఐదుగురు ఉండొచ్చని చెప్తున్నప్పటికీ.. వారికి సంబంధించి ఏ క్లూ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనా స్థలంలో దాదాపు పది ఫైర్ ఇంజిన్లు, NDRF, SDRF బృందాలు, JCBలు రెస్క్యూలో పాల్గొన్నాయి. కానీ.. ఎన్ని రంగంలోకి దిగినా నో యూజ్ అన్నట్లు మారింది పరిస్థితి. రెస్క్యూ విషయంలో అన్నీ ఇబ్బందులే.. దీంతో.. ప్రమాదంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు నాంపల్లి అగ్నిప్రమాదం విషయంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ రేంజ్‌లో రెస్క్యూ ఎందుకు చేయాల్సి వచ్చింది?.. అంటే బోలెడన్ని కారణాలు.. లెక్కలేనంత నిర్లక్ష్యం.. ప్రమాదానికి గురైన బిల్డింగ్ మొత్తం జీ ప్లస్ ఫోర్.. అంటే.. గ్రౌండ్ ఫ్లోర్, నాలుగు అంతస్తులు.. ఇది అధికారిక లెక్కల ప్రకారం.. కానీ.. అనధికారికంగా రెండు సెల్లార్లు ఉండడం షాకిస్తోంది. ఈ లెక్కన ప్రమాదానికి గురైన బిల్డింగ్ ఆరు అంతస్తులు.
రంగంలోకి JNTU ఎక్స్‌పర్ట్ కమిటీ
దాదాపు 20గంటలవుతోంది. భవనంలో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటనేది కూడా స్పష్టత లేదు. సజీవదహనం అయ్యారా? పొగతో ఉక్కిరిబిక్కిరై చనిపోయారా? ఎక్కడైనా సేఫ్‌గా దాక్కున్నారా అనేది ఇంకా తెలియడంలేదు. 200మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగుతున్నా.. ఫైర్ సిబ్బంది రెస్క్యూకి దట్టమైన పొగ తీవ్ర అడ్డంకిగా మారింది. ఒక్క మనిషి నడిచేంత స్థలం తప్ప సెల్లార్ లోకి వెళ్లటానికి దారి లేదు. దీంతో మొదటి సెల్లార్లోకే వెళ్లలేక ఎంట్రీ దగ్గరే ఆగిపోతున్నారు సిబ్బంది. పక్క బిల్డింగ్ సెల్లార్ ద్వారా గోడను పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాసేపట్లో ఘటనా స్థలానికి JNTU ఎక్స్‌పర్ట్ కమిటీ చేరుకోనుంది. లోపల చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
నో సెట్ బ్యాక్, నో ఫైర్ సేఫ్టీ, నో ఫ్యూచర్ అలర్ట్స్
బిల్డింగ్ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బిల్డింగ్‌కు సెట్ బ్యాక్ లేదు.. ఫైర్ సేఫ్టీ లేదు.. ముందస్తు జాగ్రత్తలు లేవు.. దీంతోపాటు.. లోపలికి వెళ్లేందుకు రెండు మార్గాలు ఉండగా.. వాటిని ఫర్నీచర్ సామగ్రితో నింపేయడం కారణంగా ఎంట్రీకి అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితులే ప్రమాద తీవ్రత పెరిగేందుకు కారణమని.. రెస్క్యూకి ఇబ్బందులు ఎదురయ్యాయని ఫైర్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. అందులోనూ సెల్లార్లను కేవలం పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలనే రూల్‌ను క్రాస్ చేశారని తెలిపారు.
పత్తా లేని బిల్డింగ్ యజమాని సతీష్
నాంపల్లి అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు. ఆరు అంతస్తుల బిల్డింగ్‌లో మొదటి సెల్లార్‌లో ఫర్నీచర్ మెటీరియల్స్ డంప్ చేసినట్లు గుర్తించారు. ఈ డంప్ వల్లే మంటలు భారీగా వ్యాపించడం.. దట్టమైన పొగ చుట్టుముట్టడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. షోరూమ్‌లో పనిచేసే కార్మికులు రెండవ సెల్లార్‌లోనే ఉన్నారని చెప్తున్నారు. ఇక.. ఈ బిల్డింగ్ యజమానిని సతీష్‌గా గుర్తించారు. అయితే.. అతనెక్కడున్నారనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. రెస్క్యూ తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుందని ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ తెలిపారు.
నుమాయిష్ సందర్శనకు రావద్దుః సీపీ సజ్జనార్
ఇదిలావుంటే.. నాంపల్లి అగ్ని ప్రమాదంతో అటు వైపు రోడ్డును ట్రాఫిక్ పోలీసులు క్లోజ్ చేశారు. దీంతోపాటు.. నుమాయిష్ సందర్శకులకు అలర్ట్ జారీ ఇచ్చారు. నుమాయిష్ సందర్శనను వాయిదా వేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఎవరూ రావొద్దని సూచించారు. మొత్తంగా.. నాంపల్లి అగ్నిప్రమాదానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. పార్కింగ్‌కు మాత్రమే వాడాల్సిన సెల్లార్లలో ఫర్నీచర్ సామగ్రి భారీగా డంప్ చేయడం, బిల్డింగ్‌లోకి వెళ్లే మార్గాలను కూడా ఫర్నీచర్‌తో నింపేయడం ప్రమాదం తీవ్రతను పెంచేశాయి. ఈ నేపథ్యంలో సిటీలోని సెల్లార్ల వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
