“నేను, నా భార్య, కుమారుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందరం కలిసి ఈ జీవితం ఇక చాలని అనుకున్నాం. చివరి క్షణంలో మా కుమారుడితో కలిసి మరోసారి ఆలోచన చేశాం. మనం చనిపోతే మనపై నమ్మకం పెట్టుకున్న కార్యకర్తలు ఏమైపోతారని ఆలోచించాం. కార్యకర్తల భవిష్యత్తు ఆలోచించి విరమించుకొన్నా” ఇది అరకు టీడీపీ ఇంచార్జ్ సివేరి దొన్నుదొర అవేదన.
పార్టీ కోసం కోట్ల రూపాయలు అప్పులు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. పార్టీ బలోపేతానికి చాలా కృషి చేశానన్నారు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాం. అయినా ఆత్మహత్య సరికాదని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నానన్నారు. ఎవరు ఆదరిస్తే వారికే మద్దతు ఇస్తాం. లేదంటే ఇండిపెండెంట్‌గా పొటీలో ఉంటాం అని కీలక వ్యాఖ్యలు చేశారు దొన్నుదొర.
అరకు టికెట్‌ను బీజేపీకి ఇవ్వడాన్ని టిడిపి ఇన్చార్జ్ దొన్నుదొర వర్గీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. శనివారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బీజేపీ రాజారావు వద్దు దొన్నుదొర ముద్దు అంటూ నినాదాలు చేశారు. టికెట్‌ను దొన్ను దొరకు ప్రకటించాక కనీస సమాచారం లేకుండా మార్చారంటూ అవేదన వ్యక్తం చేశారు. మూడు నాలుగు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు దొన్ను దొర.
రాష్ట్రంలో తొలిజాబితాలో టీడీపీ అరకు అసెంబ్లీ అభ్యర్ధిని ప్రకటించింది. కూటమి అభ్యర్ధిగా జనవరి 20న అరకులో టీడీపీ నిర్వహించిన రా.. కదలి రా. బహిరంగ సభలో చంద్రబాబు సభాముఖంగా స్వయంగా అరకు ఎమ్మెల్యే అభ్యర్ధిగా దొన్ను దొరను ప్రకటించారు. అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 24న ప్రకటించిన మొదటి లిస్ట్‌లో కూడా కూటమి అభ్యర్ధిగా సివేరి దొన్నుదొర పేరునే ప్రకటించారు. ఇప్పుడు అరకు అసెంబ్లీకి బీజెపీ తన అభ్యర్ధిని ప్రకటించడాన్ని టీడీపీ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…