Andhra Pradesh: ఏపీలో రోడ్లపై ప్రభుత్వం ఫోకస్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఏపీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వ దారుణ ఓటమికి.. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కూడా ఓ కారణం. వైసీపీ పాలనలో రోడ్లను పట్టించుకోవడం లేదని.. గుంతల రోడ్లతో జనం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్న విమర్శలు వినిపించాయి. సోషల్ మీడియాలో సైతం ఏపీ రోడ్లపై భారీ ట్రోలింగ్ జరిగింది. టీడీపీ, జనసేనలు కూడా ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రచారం చేశాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో..రోడ్లపై యాక్షన్ స్టార్ట్ అయింది.
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఆర్&బి శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, పరిస్థితిపై ఆరా తీశారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించకపోవడంతో..పనులు చేసేందుకు ఇప్పుడెవరూ ముందుకురావడం లేదని వివరించారు. ప్రస్తుతం 4 వేల 151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉందని చెప్పారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు 2 వేల 936 కిలోమీటర్ల మేర ఉన్నాయని.. మొత్తంగా 7 వేల 87 కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టాలని అధికారులు వివరించారు. గుంతలు పూడ్చేందుకు తక్షణం 300 కోట్లు అవసరమని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే టెండర్లు పిలిచి ఆ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు..ముఖ్యమంత్రి. రాష్ట్రంలో మొత్తం 53 వేల కిలోమీటర్ల రోడ్లు ఉండగా..వాటిలో 8 వేల కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉన్నాయి. ఇక 12 వేల 450 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు కాగా..జిల్లా రహదారులు చిన్నరోడ్లు కలిపి మరో 32 వేల 750 కిలోమీటర్లు ఉన్నాయి. వీటి మరమ్మతులకు ఎంత వ్యయం అవుతుందో నివేదిక తయారు చేయాలని చెప్పారు..సీఎం చంద్రబాబు.
రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించడంపై కూడా సమీక్షలో చర్చ జరిగింది. పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లతో పాటు ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు ఇందులో పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో మన్నిక ఉండేలా రోడ్ల నిర్మాణానికి జరిగిన పరిశోధనల వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. సాంప్రదాయ పద్దతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలపై కూడా చర్చించారు.
ఇటీవలే గ్రామీణాభివృద్ధిపై సమీక్ష జరిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 250 జనాభా కలిగిన ప్రతీ గ్రామానికి రహదారుల అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యం అవుతుందన్నారు. 4 వేల 976 కోట్ల రూపాయల నిధులతో 7 వేల 213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు కార్యరూపం ఇవ్వాలని చెప్పారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతోపాటు..సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. మొత్తానికి ప్రభుత్వ చర్యలు చూస్తుంటే..ఏపీలో రోడ్లకు త్వరలోనే మహర్ధశ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..