Hyderabad: మరికొన్నేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. వైసీపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ రియాక్షన్ ఇదే!
హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న విభజన చట్టం నిబంధనపై మళ్లీ రగడ మొదలైంది. ఈ ఏడాది జూన్‌తో పదేళ్ల గడువు పూర్తవుతుండడంతో.. పొడిగింపు కోసం ఏపీ పట్టుపట్టబోతోందా? అదే జరిగితే తెలంగాణ రియాక్షన్ ఏంటి..? పార్లమెంటు సమావేశాల్లో ఈ లొల్లి ముదరబోతోందా? రెండు రాష్ట్రాల్లో రాజకీయ నేతల కామెంట్లు చూస్తే అదే అనిపిస్తోంది.

ఎన్నికల సమయంలో ఏపీ రాజధాని అంశం మరోసారి కాక పుట్టిస్తోంది. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్ అయ్యే దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న వాదన వైసీపీదైతే, తిరుపతి రాజధాని అంశాన్ని కాంగ్రెస్ తెర మీదకి తెచ్చింది. ఆస్తుల పంపకం, హామీల అమలు జరగకుండా రాజధానిపై హక్కు వదులు కోకూడదంటున్న రాయలసీమ ఉద్యమకారులు తిరుపతి క్యాపిటల్‌పై రాజకీయ ఒత్తిడికి డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో ఏపీ రాజధాని హడావుడి హాట్ టాపిక్ గా మారబోతోంది.
రెండుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ అంశంపై ఇప్పుడు పొలిటికల్ చర్చ ప్రారంభమైంది. మే నెల చివరి నాటికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని హక్కును ఏపీ కోల్పోతున్న తరుణంలో రాజధాని అంశం ఆసక్తికరంగా మారింది. మూడు రాజధానులతో ముందుకు వెళ్తున్న వైసీపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం అయ్యే దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగాలంటోంది.
హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న విభజన చట్టం నిబంధనపై మళ్లీ రగడ మొదలైంది. ఈ ఏడాది జూన్‌తో పదేళ్ల గడువు పూర్తవుతుండడంతో.. పొడిగింపు కోసం ఏపీ పట్టుపట్టబోతోందా? అదే జరిగితే తెలంగాణ రియాక్షన్ ఏంటి..? పార్లమెంటు సమావేశాల్లో ఈ లొల్లి ముదరబోతోందా? రెండు రాష్ట్రాల్లో రాజకీయ నేతల కామెంట్లు చూస్తే అదే అనిపిస్తోంది.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరికొంతకాలం కొనసాగించాలని ఏపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామన్నారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని.. వాస్తవ పరిస్థితుల్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు. అయితే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఇంకొన్నేళ్లు కొనసాగించాలన్న ప్రతిపాదన మంచిదే అని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ఇది వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని.. పార్టీ విధానం కాదని తెలిపారు.
ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి భిన్నంగా స్పందించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించడం సరికాదని తెలిపారు. ఇక ఐదేళ్లు కళ్ళు మూసుకుని ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు పెంచాలనడం ప్రజలను మోసం చేయడమే అన్నారు టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు. అమరావతిని నాశనం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ప్రతిపాదన సరికాదని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఎవరి పరిపాలన వారు సాగిస్తున్నారని గుర్తు చేశారు.
అయితే హైదరాబాద్ జోలికి వస్తే ఊరుకోబోమని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు. ఎవరి పాలన వాళ్లు చేసుకుంటున్న సమయంలోఈ ప్రతిపాదన మంచిదికాదన్నారు. ఉమ్మడి రాజధాని కామెంట్స్‌పై తెలంగాన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోసం వైసీపీ సెంటిమెంట్ రాజకీయాలు తెరమీదకి తెస్తోందన్నారు అద్దంకి దయాకర్. వచ్చే ఎన్నికల్లో జగన్, కేసీఆర్ లబ్ధి కోసమే మొన్నటిదాకా KRMB అంశం.. ఇప్పుడు ఉమ్మడి రాజధాని అంశంతో మళ్లీ సెంటిమెంట్ రాజేస్తున్నారని అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. ఇంకా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ఉంటుందనుకోవడం మూర్ఖత్వమని, పదేళ్ళలో ఏపీ రాజధాని ఏర్పాటు చేసుకోవడంలో అక్కడి రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని అద్దంకి దయాకర్ విమర్శించారు.
అయితే కాంగ్రెస్ ఇప్పుడు మరోసారి తిరుపతి క్యాపిటల్ అంశాన్ని తెరమీదికి తెచ్చింది. 1953 లోనే రాయలసీమలోని తిరుపతి రాజధాని కావాల్సి ఉందంటున్న వాదన ఆ పార్టీ లేవనెత్తుతోంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం తిరుపతిని రాజధాని చేస్తోందన్న నమ్మకం వ్యక్తం చేస్తోంది. తిరుపతి రాజధాని కానుందంటున్న మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్, తిరుపతి రాజధాని అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు. బ్రహ్మం గారి మాట నిజం కాబోతోందని తిరుపతికి రాజధానిని చేసేందుకు రాజకీయ ఒత్తిడి తీసుకొస్తామంటున్నారు చింతామోహన్.
ఇక రాయలసీమ రాష్ట్రానికి శాశ్వత రాజదాని ఇవ్వాల్సిందే నంటున్న రాయలసీమ ఉద్యమకారులు కాంగ్రెస్ డిమాండ్‌ను స్వాగతిస్తున్నారు. 2014 విభజన సమయంలోనే తిరుపతి రాజధాని అంశంపై అప్పటి ఎంపీ చింతామోహన్ ఇచ్చిన లేఖను పరిగణలోకి తీసుకున్న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ శివరామకృష్ణన్ కమిటీకి రెఫర్ చేశారని చెబుతున్నారు. అధికారికంగా అప్పటి ప్రధాని మన్మోహన్ పరిగణలోకి తీసుకోవాలని లేఖ రాసిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే తిరుపతికి రాజధాని వచ్చి ఉండేదంటోంది రాయలసీమ మేధావుల ఫోరం. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న అంశం హక్కులతో కూడుకున్నదంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న చిన్న విషయాలతో పలు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయంటున్న రాయలసీమ ఉద్యమకారులు విభజన చట్టం హామీలు అమలయేంత వరకు హైదరాబాద్‌పై ఉమ్మడి హక్కు కొనసాగించాలంటున్నారు. పొలిటికల్ డిమాండ్ ను స్వాగతిస్తామంటున్నారు రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




