IAS Pola Bhaskar: తన వాహనానికి టోల్ విషయమై కమిషనర్ పోలా భాస్కర్ – టోల్‌గేట్ సిబ్బంది మధ్య వాగ్వాదం
కర్నూలు-గుంటూరు రహదారిపై ఉన్న టోల్ గేట్ దగ్గర వివాదం చోటు చేసుకుంది. ప్రకాశంజిల్లా త్రిపురాంతకం మండలం
AP College Education Commissioner Pola Bhaskar: కర్నూలు-గుంటూరు రహదారిపై ఉన్న టోల్ గేట్ దగ్గర వివాదం చోటు చేసుకుంది. ప్రకాశంజిల్లా త్రిపురాంతకం మండలం మేడపి దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రకాశంజిల్లా మాజీ కలెక్టర్, ప్రస్తుతం ఏపీ కాలేజి ఎడ్యుకేషన్ కమిషనర్‌గా ఉన్న పోలా భాస్కర్ వాహనాన్ని టోల్ గేట్ సిబ్బంది అడ్డుకున్నారు. వాహనానికి టోల్ కట్టే విషయమై పోలా బాస్కర్‌తో టోల్‌గేట్ సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. తాను ఐఏయస్ అధికారినని, ప్రస్తుతం ఏపీ కాలేజ్ ఎడ్యూకేషన్ కమిషనర్‌గా ఉన్నానని పోలా భాస్కర్ టోల్ సిబ్బందికి తెలిపారు.
తనకు టోల్‌గేట్ మినహాయింపు ఇవ్వాలని పోలా భాస్కర్ కోరినా టోల్‌గేట్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఐడీ కార్డు చూపించాలంటూ పోలా భాస్కర్‌తో దురుసుగా మాట్లాడారు. దీంతో పోలా భాస్కర్ వ్యక్తిగత సిబ్బంది టోల్‌గేట్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. వాహనానికి అడ్డంగా నిలబడి టోల్‌గేట్ సిబ్బంది ఆయనను కదలకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న త్రిపురాంతకం తహసీల్దార్ కిరణ్, పోలీసులు టోల్‌గేట్ దగ్గరకు చేరుకుని ఐఏయస్ అధికారి పోలా భాస్కర్‌ను అక్కడి నుంచి పంపించేశారు.
అనంతరం టోల్‌గేట్ సిబ్బందిపై తహసీల్దర్ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వాహనాలను, అందులోనూ ఉన్నతాధికారులు ప్రయాణించే వాహనాలను అడ్డుకుని దురుసుగా వ్యవహరించడం ఏంటని టోల్‌గేట్ సిబ్బందిని నిలదీశారు. టోల్‌గేట్ దగ్గర వాహనదారులతో, ప్రభుత్వ అధికారులతో దురుసుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాశంగా మారింది.
Read also: Pralhad Joshi Dance: స్టేజ్ మీద స్టెప్పులేసి ఊదరగొట్టిన కేంద్రమంత్రి