AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: పందెంలో చచ్చిన కోడిపుంజుకు వేలం.. ఎంత ధర పలికిందో తెలిస్తే బిత్తరపోతారు

పందెంలో ఓడి పోయిన కోడి ఏమవుతుంది..? చనిపోతుంది.. లేదా.. తీవ్రగాయాల పాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.. చనిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అయితే.. అలా చనిపోయిన కోడి పుంజు మాంసం ఖరీదు ఎంత ఉంటుంది.. అటు ఇటుగా గరిష్టంగా కే.జీకి వెయ్యి రూపాయల నుంచి రెండు మూడు వేల వరకు ఇవ్వవచ్చు.. అయితే, వేలం పాటలో ఓ చనిపోయిన కోడి పుంజు రికార్డు ధర పలికింది.

Andhra News: పందెంలో చచ్చిన కోడిపుంజుకు వేలం.. ఎంత ధర పలికిందో తెలిస్తే బిత్తరపోతారు
Eluru News
B Ravi Kumar
| Edited By: Ram Naramaneni|

Updated on: Jan 18, 2025 | 2:20 PM

Share

పందెంలో ఓడి పోయిన కోడి ఏమవుతుంది..? చనిపోతుంది.. లేదా.. తీవ్రగాయాల పాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.. చనిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అయితే.. అలా చనిపోయిన కోడి పుంజు మాంసం ఖరీదు ఎంత ఉంటుంది.. అటు ఇటుగా గరిష్టంగా కే.జీకి వెయ్యి రూపాయల నుంచి రెండు మూడు వేల వరకు ఇవ్వవచ్చు.. ఎందుకంటే అంత ధర పెడితే.. మార్కెట్లో మటనే దొరకుతుంది.. అయితే చనిపోయిన పందెం కోడి కూడా ఇప్పుడు రికార్డు ధర పలకడం సంచలనంగా మారింది.. పందెంలో ఓడిపోయిన పుంజుకు వేలం వేస్తే ఒక వ్యక్తి దాన్ని అక్షరాలా రూ. 1 లక్షా 11 వేల 111 కు కొనుగోలు చేశాడు. అంత ప్రత్యేకత ఆ పుంజులో ఏముందంటే.. అది “కోజా” పుంజు కావడమే..

సాధారణంగా వినాయక చవితి, దేవి నవరాత్రులు లేదా ఇతర పర్వ దినాల్లో లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు. దైవ కార్యక్రమంలో భాగంగా సాగే ఈ ప్రక్రియ లొ వేలం పాటలో లడ్డూ కొన్న వ్యక్తి దాన్ని తన బంధువులు, కుటుంబ సభ్యులకు పంచి పెడతారు. అలాంటి ఒక వేలం పాట ఏలూరులో జరిగింది. అయితే అది లడ్డూ వేలం కాదు. చనిపోయిన కోడి పుంజు వేలం.. సంక్రాంతి సమయంలో గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతాయి. బరిలో పోరాడిన పుంజుల్లో ఏదో ఒకటి గెలుస్తుంది. మరొకటి పోరాడి ఓడిపోతుంది. అలా ఓడి పోయి చనిపోయిన పుంజు వీరమరణం పొందినట్లు పందెం రాయుళ్లు భావిస్తారు. ఇక పందెం డబ్బుతో పాటు చనిపోయిన పుంజు సైతం గెలిచిన వారి సొంతం అవుతుంది.

అయితే.. పందాలకు ముందు ఐదు నెలల పాటు పుంజులకు మంచి బలవర్ధకమైన ఆహారం పెడతారు. బాదం, జీడిపప్పులతో పాటు ఎగ్ , చికెన్, మటన్ కీమా తినిపిస్తారు. దీంతో ఇలా కోడిపుంజు బలిష్టంగా తయారవుతుంది. అయితే పోరాటంలో చనిపోయిన తర్వాత అదే కోడిని కోజాగా పిలుస్తారు. ఇలాంటి కోజా మాంసం ఎవ్వరికీ పందెం రాయుళ్లు ఇవ్వరు. అధికారులు, ప్రజాప్రతినిధులు లేదా తమ బంధువులు, కుటుంబ సభ్యులకు మాత్రమే పంచుకుంటుంటారు. ఈ కోజా మాంసం రుచి సాధారణ కోడి మాంసం కంటే బాగుంటుంది అని చెబుతారు. ఈక్రమంలో వర్షాకాలంలో గోదావరిలో దొరికే పులుసల కోసం పుస్తెలమ్మి అయినా కొనాలనే నానుడి తరహాలో సంక్రాంతి సమయంలో కోజా మాంసం తినటం సైతం ప్రతిష్టగా మారింది.

ఈ క్రమంలో ఏలూరు యన్ఆర్ పేటకు చెందిన రాజేంద్ర, ఆహ్లద్, రాజవంశీలు కోడిపుంజులు పెంచుతారు. అయితే వారి కోడి పందెంలో ఓడిపోయింది. వాస్తవంగా ఆ పుంజు గెలిచిన వారికి సొంతం కావాలి. కాని దాన్ని వారికి మళ్లీ డబ్బు చెల్లించి వెనక్కు తీసుకున్నాడు వంశీ.. బరిలో తన పుంజు బలంగా పోటీ పడిందని.. దాని గొప్పతనం అందరికీ తెలిసే విధంగా చేయాలని కోజా (చనిపోయిన కోడి)ని వేలం పాటకు పెట్టారు. ఈ పాటలో ఏలూరు రూరల్ మండలం జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ దాన్ని లక్షా 11 వేల నూట పదకొండు రూపాయలకు కొనుగోలు చేశారు.

ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. ఆయ్.. గోదావరి వాళ్లంటే మామూలు మాటలు కాదు. పులసైనా, కోజా మాంసమైనా మనసు పడ్డారంటే ఎంత కైనా తెగించేస్తారు. అంతేగా.. అంతేగా.. మరి.. అంటూ చర్చించుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..