ఎన్నికలకు నేతలను సిద్ధం చేస్తున్న సీఎం జగన్.. పార్టీ లీడర్లతో కీలక సమావేశంలో దిశా నిర్ధేశం.. ముందస్తు ఎన్నికల ప్రచారంపై వారికి క్లారిటీ..
Andhra Pradesh: నేతల పనితీరు, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎక్కడెక్కడ వెనుకబడుతున్నారనే అంశాలతో నివేదికలను నేతల ముందుంచుతున్నారు. పార్టీ పరిస్థితి వెనుకంజలో ఉంటే అక్కడి నేతలను ప్రత్యేకంగా పిలిచి మరీ మాట్లాడుతున్నారు. అవసరమై కొంతమంది ఎమ్మెల్యేలను మార్చాల్సిన పరిస్థితి వస్తే తప్పదని సంకేతాలు కూడా ఇస్తున్నారు. తాజాగా పార్టీ నేతలతో సీఎం జగన్ ఏర్పాటు చేసిన సమావేశం ప్రాధాన్యత..
ఆంధ్రప్రదేశ్, సెప్టెంబర్ 25: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు పార్టీ నేతలను సన్నద్ధం చేసే పనిలో పడ్డారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు సీఎం. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి సమావేశం అవుతున్నారు. ఇప్పటికే ఏడాదిన్నర కాలంగా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజల్లోనే ఉంటోంది వైసీపీ కేడర్. వచ్చే ఎన్నికల్లో ‘వై నాట్ 175’ అంటూ ముఖ్యమంత్రి ముందు కెళ్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఓ సారి సమావేశాలు ఏర్పాటు చేస్తూ నియోజక వర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నారు.
నేతల పనితీరు, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎక్కడెక్కడ వెనుకబడుతున్నారనే అంశాలతో నివేదికలను నేతల ముందుంచుతున్నారు. పార్టీ పరిస్థితి వెనుకంజలో ఉంటే అక్కడి నేతలను ప్రత్యేకంగా పిలిచి మరీ మాట్లాడుతున్నారు. అవసరమై కొంతమంది ఎమ్మెల్యేలను మార్చాల్సిన పరిస్థితి వస్తే తప్పదని సంకేతాలు కూడా ఇస్తున్నారు. తాజాగా పార్టీ నేతలతో సీఎం జగన్ ఏర్పాటు చేసిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో నేతలను ఎన్నికలకు సిద్దం చేయడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు సీఎం.
పార్టీ నేతలకు దిశా నిర్ధేశం..
మూడు నెలల క్రితం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్క్ షాప్ నిర్వహించారు. ఇక ఈ సారి జరుగుతున్న సమావేశంలో ఎన్నికలకు సన్నద్దతపైనే సీఎం దిశానిర్ధేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపై నేతలకు సూచనలు చేస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై నివేదికలను కూడా సీఎం బయట పెడతారని సమాచారం. అంతేకాదు పనితీరు మారని నేతల విషయంలో కూడా వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ఓ నిర్ణయానికి వస్తారని కూడా చెబుతున్నారు. ఇంకా చంద్రబాబు అరెస్ట్ తర్వాత చాలా మంది నేతలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అరెస్ట్ వెనుక అసలేం జరిగిందనే విషయాన్ని, స్కిల్ స్కాం అంశాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం దిశానిర్ధేశం చేసే అవకాశం ఉంది. మరోవైపు జనసేన-తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. అలాంటి నియోజక వర్గాలపై ముఖ్యమంత్రి మరింత దృష్టి పెడుతున్నారని సమాచారం. ఇబ్బందికర పరిస్థితి ఉండే నియోజకవర్గాల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కూడా నేతలకు సీఎం వివరించే అవకాశం ఉంది.
నేతలకు క్లారిటీ..!
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులతో సీఎం జగన్ పార్టీ నేతలకు ఏం చెబుతారనే ఆసక్తి నెలకొంది. త్వరలో పాలనను విశాఖపట్నంకు మార్చాలనే ఆలోచనతో జగన్ ఉండడంతో.. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. ఓవైపు చంద్రబాబు జైలుకి వెళ్లడం, మరోవైపు రాజధాని విషయంలో సీఎం తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకమైనవి. అయితే ఇలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై పలు సూచనలు చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. కేవలం స్కిల్ డెవలప్‌మెంట్ కేసు మాత్రమే కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలు, ఫైబర్ నెట్ అక్రమాలపై కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. ఇదే విషయాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు, ఎమ్మెల్సీలకు వివరించే చాన్స్ ఉంది. అటు ముందస్తుపై జరుగుతున్న ప్రచారంపై కూడా సీఎం జగన్ నేతలకు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.