Anandayya corona medicine : నెల్లూరు ఆయుర్వేద కరోనా మందు అధ్యయనానికి ICMR బృందాన్ని పంపాలని కోరిన సీఎం జగన్
Anandayya Ayurvedic corona medicine : కరోనాకు ఆయుర్వేద మందుగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తోన్న ఆయుర్వేదం ఔషధం ఏపీలో చర్చనీయాంశమైంది...
Anandayya Ayurvedic corona medicine : కరోనాకు ఆయుర్వేద మందుగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తోన్న ఆయుర్వేద ఔషధం ఏపీలో చర్చనీయాంశమైంది. వేలాది మంది ఆయుర్వేద మందు కోసం తరలివెళ్తుండటంతో ఈ రోజుకి ఔషధం పంపిణీని నిలిపివేశారు. అయితే, ప్రజల్లో విపరీతమైన ప్రాముఖ్యత ఏర్పడిన నేపథ్యంలో ఆనందయ్య ఔషధంపై శాస్త్రీయ నిర్థారణ చేయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందాన్ని పంపించి ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయించాలని అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో ఈ రోజు సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వెళ్లే అవకాశం ఉందని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఇలా ఉండగా, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తోన్న మందు ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోయినప్పటికీ ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు.
అయితే, ఇవాళ్టి నుంచి మళ్లీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా మందు కోసం జనం వేలాదిగా ఎగబడ్డారు. మందు పంపిణీ విషయం తెల్సుకున్న కరోనా రోగులు నెల్లూరు GGH ఆస్పత్రి ఖాళీ చేసి ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పరుగులు తీశారు. దీంతో హాస్పిటల్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య కరోనా మందు తీసుకోవడంతోనే తన ప్రాణాలు నిలబడ్డాయంటూ అనేక మంది కరోనా నుంచి బయటపడ్డ వాళ్లు చెప్పుకొస్తున్నారు. “ఊపిరి అందడంలేదు. కొన ఊపిరితో ఉన్న నాకు ఇంకా రెండు నిముషాలు ఆగితే చనిపోయే పరిస్థితి. ఈ క్రమంలో మావాళ్లు వచ్చి వెంటనే కంటిలో మందు వేశారు. 10, 15 నిముషాల్లో కోలుకున్నా.. ఈ మందు చాలా అద్భుతం” అని కృష్ణపట్నం మందు వేసుకున్న ఓ రిటైర్డ్ మాస్టారు చెప్పారు.