AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య చనిపోయిందని నమ్మబలికి రెండో పెళ్లి.. కట్‌చేస్తే రూ.28 కోట్లతో పరార్!

ఒంటరిగా ఉన్న ఓ మహిళను నమ్మకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు లాటరీ పేరుతో ఆమెకు టోకరా వేశాడు. రూ.15 కోట్లు పన్ను చెల్లిస్తే రూ.1700 కోట్లు వస్తాయని ఆశలు కల్పించాడు. చివరికి ఆమె ఆస్తులు అమ్మించి రూ.28 కోట్లు తీసుకుని పత్తా లేకుండా పారిపోయాడు. దీంతో బాధితురాలు సోమవారం చిత్తూరులో ఎస్పీ మణికంఠను కలిసి ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు..

భార్య చనిపోయిందని నమ్మబలికి రెండో పెళ్లి.. కట్‌చేస్తే రూ.28 కోట్లతో పరార్!
Fraud Marriage
Srilakshmi C
|

Updated on: Jul 09, 2025 | 11:55 AM

Share

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని రాజుపేటకి చెందిన నాగమణికి 1992లో ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి ఓ కొడుకు కూడా పుట్టాడు. కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కుమారుడు చనిపోగా, ఆ దిగులుతో భర్త కూడా మరణించాడు. కొడుకు బీమా డబ్బులు, భర్త ఆస్తులన్నీ నాగమణికి వారసత్వంగా వచ్చాయి. ఒంటరిగా ఉన్న ఆమె మరో పెళ్లి చేసుకోవాలని చిత్తూరులోని ఓ పెళ్లిళ్ల మధ్యవర్తిని సంప్రదించింది. ఈ క్రమంలో బంగారుపాళ్యం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శివప్రసాద్‌ నాయుడు అనే వ్యక్తి నాగమణిని కలిసి తన భార్య చనిపోయిందని, పిల్లలు కూడా లేరని చెప్పాడు.

అతనికి భార్య ఉన్నప్పటికీ, చనిపోయినట్లు నకిలీ డెత్‌ సర్టిఫికేట్‌ను చూపించాడు. దీంతో అతని మాటలు నమ్మిన నాగమణి పెళ్లికి అంగీకరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో శివప్రసాద్‌ నాయుడిని 2022 అక్టోబర్‌లో కర్ణాటకలోని బంగారు తిరుపతి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఇద్దరు కాపురం పెట్టారు. కొన్నాళ్ల తర్వాత తనకు ఆర్‌బీఐ నుంచి రూ.1,700 కోట్ల లాటరీ తగిలిందని శివప్రసాద్‌ నాయుడు ఓ పత్రాన్ని చూపించాడు. ఈ మొత్తం రావాలంటే పన్నుల రూపంలో రూ.15 కోట్లు చెల్లించాలని నాగమణిని నమ్మించాడు. దీంతో ఆమె తన బ్యాంకు ఖాతాలో ఉన్న దాదాపు రూ.3 కోట్ల నగదును శివప్రసాద్, అతని అన్న చక్రవర్తి, వదిన హేమలత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. రూ.15 కోట్ల విలువ చేసే భూములు, రూ.10 కోట్ల విలువ చేసే భవనాన్ని విక్రయించి మొత్తం రూ.28 కోట్లు శివప్రసాద్‌కు అప్పగించింది.

రోజులు గడుస్తున్నా ఆర్‌బీఐ నుంచి రూ.1,700 కోట్లు ఇంకా రాలేదని నాగమణి ప్రశ్నించినప్పుడల్లా మాయమాటలు చెప్పి తప్పించుకునేవాడు. ఓ సారి గట్టిగా నిలదీయడంతో చంపేస్తానని నాగమణిని బెదిరించాడు. గతేడాది డిసెంబరులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడ్ని వెతుక్కుంటూ బంగారుపాళ్యానికి వెళ్లిన నాగమణికి ఊహించని షాక్‌ తగిలింది. శివప్రసాద్‌ నాయుడికి భార్యతోపాటు ఎనిమిదేళ్ల కూతురు ఉందని తెలిసి విస్తుపోయింది. దీనిపై గట్టిగా నిలదీయడంతో అందరూ కలిసి ఆమెపై దాడిచేసి, చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ విచారణకు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.