ఆక్స్‌ఫర్డ్‌లో చదివి.. ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారిన ఓ యువకుడి కథ! ‘జీవితం కొట్టే దెబ్బలు ఇలాగే ఉంటాయ్ బాస్..’
నిరుద్యోగం.. ఒక్క భారత్‌లోనే కాదు ఎన్నో దేశాల్లో తీవ్ర స్థాయిలో ఉంది. అభివృద్ధి చెందిన చైనా వంటి దేశాల్లోనూ నిరుద్యోగ సంక్షోభం ఎక్కువగానే ఉంది. అందుకు ఈ యువకుడి గాథే నిదర్శనం. చైనాకు చెందిన ఓ యువకుడు తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఈ పోస్టు యావత్ ప్రపంచాన్ని ఆలోచనలో..

ప్రపంచవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. ఇది ఒక్క భారత్‌లోనే కాదు ఎన్నో దేశాల్లో తీవ్ర స్థాయిలో ఉంది. అభివృద్ధి చెందిన చైనా వంటి దేశాల్లోనూ నిరుద్యోగ సంక్షోభం ఎక్కువగానే ఉంది. అందుకు ఈ యువకుడి గాథే నిదర్శనం. చైనాకు చెందిన ఓ యువకుడు తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఈ పోస్టు యావత్ ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. ఆక్స్‌ఫర్డ్‌తో సహా పలు ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి డిగ్రీలు పొంది.. సరైన ఉద్యోగం సంపాదించలేకపోయానని, దీంతో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు అందులో చెప్పాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్టు (SCMP) కథనం ప్రకారం..
చైనాకు చెందిన డింగ్ యువాన్ జావో (39) అనే వ్యక్తి ప్రముఖ యూనివర్సిటీల నుంచి పీజీ నుంచి పీహెచ్‌డీ వరకు పలు డిగ్రీలను పొందాడు. వాటిల్లో బీజింగ్‌లోని సింఘువా యూనివర్సిటీలో కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ, పెకింగ్ యూనివర్సిటీ నుంచి ఎనర్జీ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి జీవశాస్త్రంలో పీహెచ్‌డీ కూడా చేశాడు. అనంతరం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి జీవవైవిధ్యంలో మరో డిగ్రీ చేశాడు. సింగపూర్ నేషనల్ యూనివర్శిటీలో పోస్ట్‌డాక్టోరల్ పరిశోధకుడిగా పనిచేశాడు. ఇన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ డింగ్‌కు ఇంతవరకు ఉద్యోగం దొరకలేదు. ఎన్నో కంపెనీలకు రెజ్యూమెలు పంపించడంతోపాటు దాదాపు 10కిపైగా ఇంటర్యూలకు హాజరైనా ఉద్యోగం దొరకలేదు. దీంతో పొట్టకూటి కోసం చివరకు ఫుడ్ డెలివరి బాయ్‌గా మారిపోయాడు.
‘ఇది స్థిరమైన ఉద్యోగం. ఎంత కష్టపడితే అంత బాగా సంపాదించవచ్చు. ఈ ఆదాయంతో నా కుటుంబాన్ని పోషించగలను. ఇదేం చేయకూడని పని కాదు. మీరూ కష్టపడి పనిచేస్తే మంచి జీవనం సాగించవచ్చు’ అని డింగ్ చెప్పుకొచ్చాడు. డింగ్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు నేటి చదువుల తీరును ఎండగడుతున్నారు. కారణాలు ఏవైనా.. పెద్ద చదువులు చదివినా ఉద్యోగం రాలేదని బాధపడేబదులు దొరికిన పని చేసుకుంటూ జీవిత సవాళ్లను అధిగమించాలని, పాజిటివ్ దృక్పధంతో ముందుకు వెళ్లాలని డింగ్ యువాన్ జావో ఉదంతం యువతకు ఇచ్చే సందేశం. ఇంతకీ మీరేమంటారు..?
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.