Vizag: ఓ ఇంటి సమీపాన గుప్పుమన్న ఘాటైన వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా..
ఓ ఇంటి సమీపాన ఉన్న ఖాళీ స్థలంలో గుప్పుమని ఘాటైన వాసన వచ్చింది. అదేంటో తెలుసుకుందామని.. ఓసారి లుక్ వేశారు. అక్కడ కనిపించిన మొక్కలు చూసి.. దెబ్బకు షాక్ అయ్యారు. ఆ మొక్కలు మరేవో కాదు.. వివరాలు ఇలా ఉన్నాయి. చూసేయండి.

విశాఖపట్నంలో గంజాయి మొక్కల కలకలం రేగింది. స్థానిక జ్ఞానాపురం రాసాల వీధిలో గంజాయి మొక్కలు బయటపడ్డాయి. జనావాసాల మధ్య ఉన్న ఖాళీస్థలంలో ఈ గంజాయి మొక్కలు పెరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. సుమారు నాలుగైదు అడుగుల వరకు పెరిగిన ఈ గంజాయి మొక్కల గురించి స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. గంజాయి మొక్కలను పూర్తిగా ధ్వంసం చేశారు. గంజాయి మొక్కలను ఎవరైనా పెంచుతున్నారా.? లేక అక్కడ గంజాయి మొక్కలు పెరగడానికి కారణం మరేదైనా ఉందా అని వివరాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అలాగే ఇది గంజాయి బ్యాచ్ పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. మొక్కలను ల్యాబ్‌కు పంపి నిర్ధారించే యోచనలో ఉన్నారు పోలీసులు.
మరోవైపు గతంలోనూ కేజీహెచ్ ఆంధ్రా మెడికల్ కాలేజ్ కొండపై గంజాయి తోటను పోలీసులు గుర్తించగా.. అది కొంతమంది యువకులు గుట్టుగా చేసిన పని అని అనుమానించారు. తాజాగా జ్ఞానాపురంలో గంజాయి మొక్కలు బయటపడటంతో స్థానికంగా ఆందోళన రేగింది. విశాఖ రైల్వే స్టేషన్ ఎనిమిదో నంబర్ ఫ్లాట్‌ఫార్మ్‌కు అతి సమీపంలో రాసాల వీధి ఉండటంతో.. రైలు ద్వారా ఈ గంజాయి రవాణా గుట్టుగా సాగుతోందని అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
