Chandrababu: మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. స్వర్ణకుప్పం విజన్‌కు శ్రీకారం..!
ఇంటింటికి సౌర విద్యుత్ వెలుగులు, ప్రకృతి వ్యవసాయంపై పైలెట్ ప్రాజెక్టులతో కుప్పం కొత్త కళను సంతరించుకోనుంది. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ నెల ఏడో తేదీన కుప్పం పర్యటన ముగించుకుని 8న విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు.
కుప్పంలో వంద శాతం సోలార్ విద్యుత్ లక్ష్యంగా ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేశారు. కుప్పం నియోజకవర్గం ఇక సోలార్ విద్యుత్ వెలుగులతో నిండిపోనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇంటింటికి సౌర విద్యుత్ అందించేందుకు నడుం బిగించారు. కుప్పం నియోజకవర్గంలో వంద శాతం సోలార్ పవర్ అందించే ప్రణాళికకు సంబంధించిన కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి.
ప్రకృతి వ్యవసాయంపై ప్రాజెక్టులకు శ్రీకారం
ఆదివారం(జనవరి 5) నుంచి మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన సాగుతుంది. ఆదివారం, సోమ, మంగళవారం కుప్పంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. ఇక ప్రకృతి వ్యవసాయం పైనా పలు పైలెట్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు చంద్రబాబు. ఇంటింటికి సౌర విద్యుత్, ప్రకృతి వ్యవసాయం లాంటి పలు పథకాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ప్రభుత్వ పనితీరు, స్థానిక అవసరాలపై నియోజకవర్గ ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. తనను ఇన్నిసార్లు గెలిపించిన ప్రజల కోసం…సమస్యలు లేని కుప్పంగా తన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు సీఎం.
స్వర్ణకుప్పం విజన్ -2029
కుప్పంలో మూడు రోజుల పర్యటన సందర్భంగా….డ్వాక్రా సంఘాలతో సమావేశం కానున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలతో పాటు… యువతతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 6న మధ్యాహ్నం 12 గంటలకు ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్-2029 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కుప్పంను 100 శాతం సోలార్ పవర్‌గా మార్చే ప్రణాళికపై ఆ సభలో మాట్లాడనున్నారు బాబు. ఈ నెల ఏడో తేదీన కుప్పం పర్యటన ముగించుకుని 8న విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..