Chandrababu: మీడియా ముందు బోరున విలపించిన చంద్రబాబు.. తీవ్ర భావోద్వేగం
అసెంబ్లీ పరిణామాలపై టీడీపీ అధినేత తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. సభలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటూ ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు.
అసెంబ్లీ పరిణామాలపై టీడీపీ అధినేత తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. సభలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటూ ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా తన భార్యను రాజకీయాల్లోకి లాగడంపై ఆయన భోరున విలపించారు . ‘నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అవమానాలు ఎదుర్కోలేదు. కానీ గత రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని విధాలా అవమానాలు ఎదుర్కొంటున్నాను. ఈ ప్రభుత్వం మా పార్టీ నాయకులు, కార్యకర్తలను వ్యక్తిగతంగా వేధిస్తోంది. కేసుల పేరుతో బెదిరిస్తోంది. బూతులు తిడుతూ దాడులకు పాల్పడుతున్నారు. వీటన్నింటినీ ప్రజలు చూశారు. తాజాగా కుప్పం ఎన్నికలు పూర్తయిన తర్వాత మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీఏసీ మీటింగ్‌కి వెళితే ‘ మీనాయకుడిని చూడాలనుంది. రమ్మనండి’ అని సాక్షాత్తూ సీఎం వ్యంగ్యంగా మాట్లాడినా భరించాం. అన్నిటిని భరించి అసెంబ్లీ సమావేశాలకు వెళితే చివరకు నా భార్యను కూడా ఇలాంటి ఈ డర్టీ పాలిటిక్సలోకి లాగారు. రాజకీయాల్లో నన్ను ప్రోత్సహించడం తప్పనిస్తే ఆమె ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. నేను 38 ఏళ్లుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నాను. ఎప్పుడూ ప్రతిపక్ష నాయకులను చులకనగా మాట్లాడలేదు. రాజకీయం అంటే ప్రజల కోసం చేసేదని నమ్మాను. ఓటములు ఎదురైనా సానుకూలంగా తీసుకుని ముందుకెళ్లాను. రాష్ట్ర ప్రయోజనాలే లక్యంగా రాజకీయాలు చేశాను’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.