ఏపీ రైల్వేకు బిగ్ బూస్ట్..! విశాఖ – విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే నెట్‌వర్క్
కేంద్ర కేబినెట్ రైల్వే రంగానికి బిగ్ బూస్ట్ అందించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్, రేణిగుంట మీదుగా నాలుగు లేన్ల రైల్వే నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది హౌరా-చెన్నై, ముంబై-చెన్నై కారిడార్లలో సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రయాణికులు, సరుకు రవాణాకు మరింత సౌకర్యాన్ని అందించి, ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక ప్రగతికి దోహదపడుతుంది.

న్యూఢిల్లీ: బుధవారం (సెప్టెంబర్ 09) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో రైల్వే రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని ప్రధాన రైల్వే మార్గాలను మరింత ఆధునీకరించడంతో పాటు రవాణా సామర్థ్యాన్ని పెంచే దిశగా పలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఏడు కీలక రైల్వే కారిడార్లలో నాలుగు లేన్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ నిర్ణయంతో దక్షిణ భారత రైల్వే నెట్‌వర్క్‌కు భారీ ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా హౌరా–చెన్నై రైల్వే కారిడార్‌లో భాగంగా విశాఖపట్నం, విజయవాడ మీదుగా నాలుగు లేన్ల రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధి చేయనున్నారు. ఈ విస్తరణతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరగడంతో పాటు ప్రయాణికులు, సరుకు రవాణాకు మరింత సౌకర్యం కలిగే అవకాశం ఉంది.
అదేవిధంగా ముంబై–చెన్నై రైల్వే కారిడార్‌లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా నాలుగు లేన్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ మార్గం దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాలను అనుసంధానించే కీలక రైల్వే మార్గాల్లో ఒకటిగా ఉంది. నాలుగు లేన్ల విస్తరణ పూర్తయితే రైళ్ల వేగం, మార్గ సామర్థ్యం, సరుకు రవాణా సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అనేక ప్రధాన రైల్వే మార్గాల్లో ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో అదనపు లైన్ల నిర్మాణం ద్వారా రైళ్ల రాకపోకలకు ఎదురయ్యే సమస్యలను తగ్గించడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలను ప్రధాన పోర్టులు, నగరాలతో అనుసంధానించడంలో ఈ కారిడార్లు కీలకంగా మారనున్నాయి.
కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే కీలక రైల్వే మార్గాలకు మరింత ప్రాధాన్యం లభించనుంది. విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, రేణిగుంట వంటి ప్రధాన రైల్వే జంక్షన్ల మీదుగా నాలుగు లేన్ల నెట్‌వర్క్ అభివృద్ధి చెందితే భవిష్యత్‌లో పెరగనున్న ప్రయాణికుల, సరుకు రవాణా అవసరాలను తీర్చేందుకు ఇది ఉపయోగపడనుంది.
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైల్వే రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలో అధిక రద్దీ ఉన్న ఏడు కీలక రైల్వే కారిడార్లను నాలుగు లేన్లు, నాలుగు ట్రాక్‌లకు విస్తరించే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ముఖ్యంగా కోల్‌కతా – ఢిల్లీ, చెన్నై–కోల్‌కతా, ఢిల్లీ–ముంబై, ముంబై–చెన్నై, బిలాస్‌పూర్–కట్నీ వంటి కీలక మార్గాల్లో రైల్వే సామర్థ్యాన్ని పెంచనున్నారు. ముంబై–హౌరా హై డెన్సిటీ నెట్‌వర్క్‌లో భాగంగా ఖరగ్‌పూర్–ఝార్సుగూడ మధ్య 367 కిలోమీటర్ల నాలుగో లైన్‌కు రూ.6,528 కోట్లతో ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే అరకున్నం–రేణిగుంట మధ్య మూడో, నాలుగో లైన్ల నిర్మాణానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఒక్కో లైన్ 77 కిలోమీటర్ల పొడవుతో ఉండగా, ఈ ప్రాజెక్టుకు రూ.1,936 కోట్లు ఖర్చు కానుంది.
దేశంలోని సుమారు 11,000 కిలోమీటర్ల హై డెన్సిటీ రైల్వే కారిడార్లు దాదాపు 40 శాతం రైల్వే ట్రాఫిక్‌ను నిర్వహిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటికే 2,000 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని, మరో 5,000 కిలోమీటర్ల పనులు పురోగతిలో లేదా ఆమోద దశలో ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో సుమారు 656 కిలోమీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్ విస్తరించనుంది. 4,790 గ్రామాలకు చెందిన సుమారు 56 లక్షల మందికి మెరుగైన రైలు కనెక్టివిటీ లభించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
