AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: సింగిల్ కిడ్నీ సాయి.. బెట్టింగ్ డబ్బుల కోసం ఏకంగా కిడ్నీనే అమ్ముకున్నాడు..

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన గుంటూరు జిల్లాకు చెందిన వెన్న దుర్గా దినేష్ అలియాస్ సాయి అప్పుల కోసం కిడ్నీ అమ్ముకున్నాడు. అయినా అప్పులు తీరకపోవడంతో దొంగతనాలకు పాల్పడ్డాడు. జైలులో పరిచయమైన వారికి చోరీలలో శిక్షణ ఇచ్చి ఒక ముఠాగా ఏర్పడి వరుస నేరాలు చేశాడు. వ్యసనాలు జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో చెప్పడానికి సాయి జీవితమే ఒక ఉదాహరణ.

Andhra: సింగిల్ కిడ్నీ సాయి.. బెట్టింగ్ డబ్బుల కోసం ఏకంగా కిడ్నీనే అమ్ముకున్నాడు..
Single Kidney Sai
Ram Naramaneni
|

Updated on: Sep 30, 2026 | 2:22 PM

Share

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా పాతాళానికి తోసిందో గుంటూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటన నిరూపిస్తోంది. సరదాగా మొదలుపెట్టిన బెట్టింగ్ క్రమంగా తీవ్రమైన వ్యసనంగా మారి, అప్పులకు, ఆపై కిడ్నీ అమ్మకానికి, చివరకు దొంగతనాలకు దారితీసింది. మనిషిని ఎంతటి హీన స్థాయికి దిగజారుస్తుందో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనం. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వెన్న దుర్గా దినేష్ అలియాస్ సాయిని బెట్టింగ్ ప్రపంచంలో సింగిల్ కిడ్నీ సాయి అని పిలుస్తారు. ఆన్‌లైన్ బెట్టింగ్ అలవాటు పడి లక్షల రూపాయల అప్పులు చేయడంతో, వాటిని తీర్చడానికి తన కిడ్నీని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కిడ్నీ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులు కూడా అతని అప్పులను తీర్చడానికి సరిపోలేదు. దీంతో సాయి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అతనిపై 12 చోరీ కేసులు నమోదయ్యాయి.

పలుమార్లు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లిన సాయికి, అక్కడే ఎడ్లపాడుకు చెందిన గుంజి యేసురాజా అనే వ్యక్తి పరిచయమయ్యాడు. జైలులోనే సాయి యేసురాజాకు దొంగతనాలు ఎలా చేయాలో శిక్షణ ఇచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత, సాయి, యేసురాజా ఇద్దరూ కలిసి తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేయడం మొదలుపెట్టారు. నాదెండ్ల మండలం గణపవరంలో రెండు చోరీలు, చిలకలూరిపేటలో ఒక చోరీకి పాల్పడ్డారు. వీరి నేరాల పరంపరలో భాగంగా, ఎడ్లపాడుకు చెందిన బచ్చు పార్వతి నాగలక్ష్మి హైదరాబాద్‌లోని తన కుమారుడి ఇంటికి వెళ్లిన విషయాన్ని గమనించారు. సాయి, యేసురాజా, వారి స్నేహితుడు షేక్ నాగుర్ భాషతో కలిసి ఆ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ 50 సవర్ల బంగారు ఆభరణాలు, 5.4 కిలోల వెండి,  2 లక్షల రూపాయల నగదును అపహరించారు. పల్నాడు గ్రామీణ ప్రాంతాల్లో వరుస చోరీల కేసులు పెరగడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. దొంగతనాలు జరిగిన ప్రదేశాల్లోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక పెట్రోల్ బంక్ వద్ద దుప్పటి ముసుగు వేసుకుని వెళ్తున్న ఒక వ్యక్తిని గుర్తించారు. పలుచోట్ల సీసీ కెమెరాల్లో ఇదే తరహా దుప్పటి ముసుగు వ్యక్తి కనిపించడంతో, ఆ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి యేసురాజాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో యేసురాజా సాయి పేరు చెప్పాడు. దీంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి, యేసురాజా ద్వారా వలపన్ని సెప్టెంబర్ 18న సింగిల్ కిడ్నీ సాయిని అరెస్టు చేశారు.

సాయి నుంచి దొంగిలించిన 50 సవర్ల బంగారు ఆభరణాలు, 5.4 కిలోల వెండి, 2 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాయి (A1)తో పాటు యేసురాజా (A2), షేక్ నాగుర్ భాష (A3)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యసనాలు మనిషిని ఎంతకైనా దిగజారుస్తాయి అనడానికి సింగిల్ కిడ్నీ సాయి జీవితమే నిదర్శనం. బెట్టింగ్‌కు బానిసై కిడ్నీ అమ్ముకోవడమే కాక, చోరీల బాట పట్టి, జైలుకు వెళ్లినా కూడా తన ప్రవర్తనను మార్చుకోలేకపోయాడు.

Follow Us