Weather Update: ఏపీలో అలా.. తెలంగాణ ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఊపందుకోవడంతో తెలంగాణలో మాత్రం వాతావరణం పూర్తిగా పొడిగా మారనుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు పూర్తిగా పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. దీనితో పాటు ఉత్తర తమిళనాడు తీరం, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు మరో ఆవర్తనం నెలకొని ఉంది. అటు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావాల కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి.
కోస్తాంధ్ర, యానాంలో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంబడి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల పడే సూచనలు ఉన్నాయని, గంటకు 30-50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. శుక్రవారం కూడా రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగనున్నాయి.
తెలంగాణలో ఇలా
తెలంగాణ విషయానికి వస్తే.. నైరుతి రుతుపవనాలు దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల మీదుగా క్రమంగా ఉపసంహరణ దిశగా సాగుతున్నాయి. గతంలో దక్షిణ తెలంగాణ మీదుగా కొనసాగిన ద్రోణి ప్రస్తుతం దక్షిణ కర్ణాటక-తమిళనాడు మీదుగా మన్నార్ సింధుశాఖ వైపు కదిలిపోయింది. దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఎలాంటి వర్ష సూచన లేదని, పూర్తిగా పొడి వాతావరణమే కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
