అమెరికాలో భారతీయ విద్యార్థికి షాక్! వెంబడించి మరీ వేధింపులు!
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో భారతీయ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి తనను జాత్యహంకార వ్యాఖ్యలతో దూషించడమే కాకుండా.. వెంబడించి, తోసివేశాడని విద్యార్థి ఆరోపించాడు. ఈ ఘటనతో విద్యార్థి ప్రాణభయంతో వణికిపోయాడు. సెప్టెంబర్ 17న చోటుచేసుకున్న ఘటనను "హేట్ క్రైమ్ దాడి''గా నమోదు చేసింది యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా పబ్లిక్ సేఫ్టీ విభాగం.

‘లుక్ ఎట్ దిస్ ఇండియన్’ అంటూ తనను ఓ అమెరికన్ వేధించాడని రెడిట్‌లో సదరు విద్యార్థి వివరాలు వెల్లడించాడు. అర్ధరాత్రి సమయంలో మార్స్్టన్ ప్రాంతం నుంచి తిరిగి వస్తూ వావా వద్ద ఆగి, తిరిగి క్యాంపస్‌కు నడుచుకుంటూ వెళ్తున్నాడు విద్యార్థి. అదే సమయంలో ఓ వ్యక్తి అతడి దగ్గరకు వచ్చి ఫోన్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు.
‘‘లుక్ ఎట్ దిస్ ఇండియన్..’’ అంటూ తనను అసభ్యకరమైన జాత్యహంకార పదాలతో దూషించాడని విద్యార్థి రెడిట్ పోస్ట్ లో తెలిపాడు. తాను అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆ వ్యక్తి తనను వెంబడిస్తూ దూషణలు కొనసాగించాడని తెలిపాడు. రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన సమయంలో తనకు ఎదురుగా నిలబడి దగ్గరకు వచ్చి బలంగా తోసేశాడని ఆరోపించాడు.
బ్యాగ్ లాక్కునేందుకు ప్రయత్నం
ఆ తర్వాత తను వేగంగా నడవడం ప్రారంభించానని విద్యార్థి రాసుకొచ్చాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి తనను వెంబడిస్తూ.. బ్యాగ్‌లో ఏముందో చూద్దామంటూ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడట. అతడి నుంచి తనను తాను కాపాడుకునేందుకు బ్యాగ్‌ను పక్కకు లాగానని, ఆ సమయంలో భద్రత కోసం తాను కూడా వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించానని విద్యార్థి తెలిపాడు. ఆ వ్యక్తి తనను ఆత్మహత్య చేసుకోవాలని కూడా దూషించాడని ఆరోపించాడు.
‘ప్రాణాలకు భయపడ్డాను’
‘‘అతడు నాపై దాడి చేయడానికి ముందు నేను నిజంగానే నా ప్రాణాల గురించి భయపడ్డాను. అక్కడి నుంచి వెళ్లిపోకుండా అతడు నన్ను అడ్డుకున్నాడు’’ అని విద్యార్థి పేర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థి తనను వేధిస్తున్న వ్యక్తిని రికార్డ్ చేయడం ప్రారంభించిన తర్వాత అతడు మరింత ఆగ్రహానికి గురైనట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటనపై విద్యార్థి యూనివర్సిటీకి ఫిర్యాదు చేసినట్లు, వేధింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించినట్లు రెడిట్‌లో ఈ కేసు పై అప్ డేట్ ను పలువురు అందించారు. అయితే ఈ వివరాలపై అధికారికంగా పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.