Andhra Pradesh: ఏపీకి కేంద్రం శుభవార్త.. త్వరలో విశాఖపట్టణానికి మరో భారీ ప్రాజెక్టు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. మూడు రాజధానులే తమ ప్రధాన్యతా అంశమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో విశాఖపట్టణంలో..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. మూడు రాజధానులే తమ ప్రధాన్యతా అంశమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో విశాఖపట్టణంలో బయో టెక్నాలజీ పార్కు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపాల్సి ఉంది. ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం పార్లమెంటు వేదికగా తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు బయో ఇంక్యుబేషన్ సెంటర్లపై బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన మూడు బయో ఇంక్యుబేషన్ సెంటర్లలో రెండు విశాఖపట్నంలో, ఒకటి తిరుపతిలో ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ఇంక్యుబేషన్ సెంటర్లపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 75 ఇంక్యుబేషన్ సెంటర్లను మంజూరు చేయగా, మూడు బయో ఇంక్యుబేషన్ సెంటర్లు ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైనట్టు వెల్లడించారు.
మరోవైపు దేశవ్యాప్తంగా 8 బయో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేశామని కేంద్రమంత్రి తన సమాధానంలో తెలిపారు. విశాఖపట్నంలో కూడా బయో టెక్నాలజీ పార్క్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఏపీ మెడ్ టెక్ జోన్ లిమిటెడ్ కి చెందిన బయోటెక్నాలజీ విభాగం నుంచి విశాఖలో బయోటెక్నాలజీ పార్కు ఏర్పాటు కోసం డీపీఆర్ అందిందని కేంద్ర మంత్రి తెలిపారు. విశాఖలో బయో-టెక్నాలజీ పార్కు ప్రతిపాదన గురించి మంత్రిత్వ శాఖకు స్టీరింగ్ కమిటీ నుంచి సిఫార్సు అందిందని, ఈ ప్రతిపాదన ఆమోదం పొందినవెంటనే బయోటెక్నాలజీ పార్కు కోసం బయో టెక్నాలజీ కేంద్ర మంత్రిత్వ శాఖ 30 కోట్ల రూపాయల వరకు గ్రాంటును అందిస్తుందన్నారు.
ఈ అంశంపై ఎంపీ జీవీఎల్.నరసింహరావు స్పందిస్తూ.. బయోటెక్నాలజీ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో దేశంలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ హబ్ గా విశాఖ ఆవిర్భవించడానికి సమయం ఆసన్నమైందన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అవసరమైన సాయం పొందడానికి తాను పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తానని ఒక ప్రకటనలో తెలిపారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..