Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Caste-based survey: పైలెట్ ప్రాజెక్టుగా 5 సచివాలయాల్లో కులగణన.. ఈ నెల 27 నుంచి పూర్తి స్థాయి సర్వే

ఆంధ్రప్రదేశ్‌లో కులగణనకు శ్రీకారం చుట్టబోతోంది జగన్‌ సర్కార్. నవంబర్ 15 నుంచి రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనుంది. ఐదు ప్రాంతాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ షురూ కానుంది. అలాగే జిల్లా స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Caste-based survey: పైలెట్ ప్రాజెక్టుగా  5 సచివాలయాల్లో కులగణన.. ఈ నెల 27 నుంచి పూర్తి స్థాయి సర్వే
YS Jagan
Follow us
pullarao.mandapaka

| Edited By: Balaraju Goud

Updated on: Nov 15, 2023 | 10:26 AM

ఆంధ్రప్రదేశ్‌లో కులగణనకు శ్రీకారం చుట్టబోతోంది జగన్‌ సర్కార్. నవంబర్ 15 నుంచి రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనుంది. ఐదు ప్రాంతాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ షురూ కానుంది. అలాగే జిల్లా స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కులగణన నవంబర్ 15 నుంచి ప్రారంభం అవుతుంది. కుల‌గ‌ణ‌న‌కు తొలి అడుగుప‌డుతుంది. ఇవాళ, రేపు పైలెట్ ప్రాజెక్ట్ గా కుల‌గ‌ణ‌న కార్యక్ర‌మాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది. చివరిసారిగా దేశవ్యాప్తంగా కులగణన 1931 లో జరిగింది. ఆ తర్వాత నుంచి కులాలకు సంబంధించి నిర్దిష్టమైన లెక్కలు లేవు. ఏ కులం జనాభా ఎంతమంది ఉన్నారనేది అంచనాల ప్రకారం చెప్పడం తప్పా, సరైన గణాంకాలు లేవు. 92 ఏళ్ల త‌ర్వాత జ‌రుగుతున్న కుల‌గ‌ణ‌న ద్వారా మ‌రింత మెరుగ్గా సంక్షేమం అందించేందుకు వీల‌వుతుంద‌ని ప్రబుత్వం చెబుతుంది. నవంబర్ 27 నుంచి పూర్తి స్థాయి స‌ర్వే ప్రారంభం కానుంది. సామాజిక సమీకరణాలు,కులాలవారీ గా ప్రజల లెక్క తేల్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పేద‌లు, అట్టడుగు వ‌ర్గాల‌ ప్రజలను ఉన్నతస్థాయికి తీసుకురావ‌డ‌మే టార్గెట్ గా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే స‌మ‌గ్ర కుల‌గ‌ణ‌న అంటుంది ఏపీ స‌ర్కార్. 92 ఏళ్ల త‌ర్వాత చేప‌డుతున్న కుల‌గ‌ణ‌నతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కులాల లెక్క తేలుస్తామంటుంది. రాష్ట్రంలో ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకునేందుకు కులగణన చేపట్టాలని నవంబర్ మూడో తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇటీవ‌ల బీహార్ ప్రభుత్వం కుల‌గ‌ణ‌న చేప‌ట్టింది. ఏపీలో కూడా స‌మ‌గ్ర కుల‌గ‌ణ‌న ద్వారా పేద‌లు, అట్టడుగు,బ‌ల‌హీన వ‌ర్గాల ఉపాధి, ఆదాయం, విద్య… ఇలా అన్ని రంగాల్లో వారి స్థితిగతుల‌ను అంచనా వేసేలా స‌ర్వే చేప‌డుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కుల‌గ‌ణ‌న ఎలా చేప‌ట్టాలి. ఎలాంటి డేటా తీసుకోవాలి వంటి అంశాల‌తో ఇప్పటికే విధివిధానాలు ఖరారు చేసింది. నవంబర్ 27నుంచి పూర్తి స్థాయి కుల‌గ‌ణ‌న ప్రారంభం కానుంది. ఇవాళ, రేపు ఎంపిక చేసిన మూడు గ్రామ‌, రెండు వార్డు స‌చివాల‌యాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద స‌ర్వే చేప‌ట్టనున్నారు.

సర్వే ఎక్కడెక్కడ, ఎలా చేస్తారు..?

స‌ర్వే మొత్తం గ్రామ, వార్డు వాలంటీర్లు-సచివాలయ సిబ్బంది ద్వారా జరగనుంది. దీని కోసం ప్రత్యేకంగా యాప్ కూడా తీసుకొచ్చారు. ఇంటింటికీ వెళ్లి తీసుకునే సమాచారం యాప్ లోనే డిజిటల్ విధానంలో అప్ లోడ్ చేయాలి. దీనికి సచివాలయ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. నవంబర్ 27 లోగా ఒకే విడతలో కులగణన పూర్తి చేయాలి. ఎక్కడైనా మిగిలిపోయిన ఇళ్లు ఉంటే డిసెంబర్ 10వ తేదీకి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆధారాల కోసం ఎలాంటి సర్టిఫికెట్లు అడగకూడదు. ప్రతి వ్యక్తి పేరు, వయసు, లింగం, భూమి, ఇంట్లోని పశువులు, వృత్తి, అన్నిరకాలుగా వచ్చే ఆదాయం, కులం, ఉపకులం, మతం, విద్యార్హత, నివాసం ఉండే ఇల్లు, మంచినీటి సదుపాయం, టాయిలెట్లు, గ్యాస్ ఉందా లేదా అనే వివరాలు సేకరిస్తారు.

మరోవైపు ఇదే అంశానికి సంబంధించి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. మేధావులు, నిపుణులు, కుల సంఘాలతో నవంబర్ 17 న రాజమండ్రి, కర్నూలు, 20న విశాఖపట్నం, విజయవాడ, 24వ తేదీన తిరుపతిలో రీజినల్ సమావేశాలు నిర్వహిస్తారు. పైలెట్ ప్రాజెక్టును వైఎస్సార్ జిల్లా పులివెందుల పరిధిలో,శ్రీకాకుళం జిల్లా గార మండలంలో,డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పరిధిలో, ఎన్ఠీఆర్ జిల్లాలో ఒక సచివాలయంలో పరిధిలో చేపట్టనున్నారు. ఆయా సచివాలయాల పరిధిలో ఇళ్ల వద్దకు వెళ్లి కులగణన సర్వే చేయనున్నారు.

ఈ నెల 27 నుంచి పూర్తి స్థాయి సర్వే

పైలెట్ ప్రాజెక్టు లో ఏదైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుని పూర్తి స్థాయి సర్వేకు సిద్ధం కానున్నారు. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించిన తర్వాత సంబంధిత ఇంటి యజమాని ధ్రువీకరణ చేసిన తర్వాత వాటిని యాప్ లో అప్ లోడ్ చేస్తారు. ఇలా వారం రోజుల్లో మొత్తం కోటీ 60 లక్షల ఇళ్ల నుంచి వివరాలు సేకరిస్తారు. ఇంకా ఎక్కడైనా ఒకట్రెండు ఇళ్లు మిగిలిపోతే డిసెంబర్ పదో తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కుల‌గ‌ణ‌న ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు ఆర్ధికంగా వెనుక‌బ‌డిన ప్రజ‌ల‌కు మ‌రింత తోడ్పాటు అందించేందుకు వీలుగా ముందుకెళ్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…