Nagari: నగరిలో రోజాకు టికెట్ ఇస్తారా? రిజెక్ట్ చేస్తారా? అసలు అభ్యర్ధులుగా నిల్చునేదెవరు?
ఫైనల్‌గా నగరి టికెట్ ఎవరికి దక్కబోతోంది? ఆర్కే రోజాకే ఇస్తారా? అభ్యర్థిని మారుస్తారా? మారిస్తే ఎవరికిస్తారు? ఇటు టీడీపీ నుంచి బరిలో దిగేది ఎవరు? అన్నదమ్ముల్లో ఎవరి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తారా? నగరి రాజకీయం మాత్రం కొంత అస్పష్టంగానే ఉంది.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యేగా గెలిచేది ఎవరు? అసలు అభ్యర్ధులుగా నిల్చునేదెవరు? సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు టికెట్ ఇస్తారా? ఇవ్వకపోతే ఏ కారణంతో రిజెక్ట్ చేయబోతున్నారు? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆనియోజకవర్గ వైసీపీలో.. వర్గపోరు రచ్చకెక్కుతోంది. స్వయాన సీఎం చొరవ చూపిన ఆనేతల్లో మార్పు లేదు. చేతులు కలిపిన ఆక్షణాలు ఆనిమిషానికే పరిమితమైంది. ఎవరికివారు తగ్గేదేలేదంటూ పోటాపోటీగా కార్యక్రమాలతో బిజీ బిజీ అయ్యారు. అటు ప్రతిపక్ష పార్టీల నేతలు అప్పుడు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ముందుగా ఆర్కే రోజా విషయానికే వద్దాం. ఎంతైనా సిట్టింగ్ ఎమ్మెల్యే, అందులోనూ మంత్రి కదా. మరి, 2024లో రోజాను ఇలా పిలవగలమా? వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా? అసలు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? ఈసారి రోజాకు నగరి టికెట్ ఇవ్వరని బాగా ప్రచారం జరుగుతోంది. అలా కాదనో, అవన్నీ తప్పుడు ప్రచారాలనో గట్టిగా చెప్పాల్సిన రోజా.. టికెట్ ఎవరికి ఇచ్చినా సహకరిస్తానని చెప్పుకొచ్చారు. ఒకసారి ఎమ్మెల్యే అయి ప్రజలకు సేవ చేస్తే చాలు అనుకున్నా.. అలాంటిది సీఎం జగన్ తనకు రెండు సార్లు టికెట్లు ఇచ్చారు. అదే చాలు అంటూ మాట్లాడారు. రోజా చేసిన ఈ వ్యాఖ్యలే టికెట్ ఇవ్వరేమోనన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.
అయితే, రోజాకు టికెట్ ఇవ్వకపోతే.. జనంలో ఓ నెగటివ్ సిగ్నల్ వెళ్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఫైర్‌బ్రాండ్‌గా, ప్రతి సందర్భంలోనూ టీడీపీపై విరుచుకుపడే బలమైన లేడీ వాయిస్‌గా రోజాకు ఓ పేరుంది. వైసీపీ తరపున వినిపించే మహిళా గొంతు రోజాది మాత్రమే. తాను జగనన్న సైనికురాలిని అని చెప్పుకుంటూ అందరికంటే ఎక్కువ స్వామిభక్తి ప్రదర్శిస్తుంటారు రోజా. సో, రోజాను తప్పించేంత సాహసం చేయకపోవచ్చనేది ఓ వాదన. సరే.. టికెట్ ఇచ్చారనే అనుకుందాం. టికెట్ ఇచ్చినా గెలుస్తారనే నమ్మకం ఉందా? ఈ అనుమానం ఎందుకంటే.. నగరి నియోజకవర్గంలోని వైసీపీ నేతలను రోజా కలుపుకొని వెళ్లలేదనేది అతిపెద్ద విమర్శ. ఎవరివరకో ఎందుకు.. పోయినసారి రోజాను గెలిపించామని చెబుతున్న ఆ నియోజకవర్గ నేతలే ఈ మాట అంటున్నారు. అందులోనూ రోజా గెలిచింది కూడా పెద్ద మెజారిటీతో కాదు. 2014లో జస్ట్ 858 ఓట్లతో, 2019లో 2,700 ఓట్లతో గెలిచారు. ఈసారి పరిస్థితులు రోజాకు అస్సలు అనుకూలంగా లేవనే రిపోర్ట్ సీఎం జగన్‌కు వచ్చిందని చెబుతున్నారు. అందుకే, టికెట్ ఇవ్వడం లేదనే చర్చ బలంగా జరుగుతోంది.
రోజాకు ఎందుకు టికెట్ ఇవ్వరని ప్రశ్నిస్తే.. నగరి నియోజకవర్గంలో మరో సమాధానం కూడా వినిపిస్తుంది. రోజా విషయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమంత పాజిటివ్‌గా లేకపోవడం వల్లే ఈసారి టికెట్ రాకపోవచ్చనే ఆన్సర్ కచ్చితంగా వినబడుతుంది. నగరి నియోజకవర్గంలో భూదందాలు, అవీనితికి అడ్డూ అదుపు లేకపోయిందన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి రోజా ఇద్దరు సోదరులపై అనేక భూదందా ఆరోపణలు ఉన్నాయి. ఇసుక దందా, బియ్యం అక్రమ రవాణాలోనూ మంత్రి సోదరులపై ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు.
పైగా నగరిలో రోజాకు ప్రత్యర్ధులు కూడా ఎక్కువే. ప్రత్యర్ధులంటే అపోజిషన్ పార్టీ వాళ్లు కాదు. సొంత పార్టీలోనే రోజాకు ప్రత్యర్ధులు ఉన్నారు. నగరి నియోజకవర్గంలో 5 మండలాల వైసీపీ నేతలు రోజాకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. నగరిలో కేజే కుమార్, నిండ్రలో చక్రపాణి రెడ్డి, విజయపురంలో లక్ష్మీపతి రాజు, వడమాలపేటలో మురళీధర్ రెడ్డి, పుత్తూరులో ఎలుమలై.. ఇలా మూకుమ్మడిగా రోజా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుండడంతో నియోజకవర్గంలో రోజా ఒంటరి అయ్యారు. రోజా ఎవరినీ కలుపుకొని వెళ్లడం లేదన్న కంప్లైంట్ వెళ్లడంతో.. ఈ ఐదుగురికి అధిష్టాన పెద్దలే వివిధ పదవులు ఇప్పించి మరో పవర్ సెంటర్ తయారుచేయించారనే టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే రెడ్డిగారి చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ఆలయ పాలకమండలి ఛైర్మన్ పదవి ఇవ్వడానికి కారణం రోజాకు చెక్‌పెట్టేందుకేనన్న చర్చ జరుగుతోంది. ఇక కేజే శాంతికి ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి, లక్ష్మీపతిరాజుకు రైతు సంఘం నేత పదవి ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అయితే.. వీరికి, రోజాకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు స్వయంగా సీఎం జగనే ప్రయత్నించారు. ఆమధ్య ఒకే వేదికపై ఉన్న కేజే శాంతితో మంత్రి రోజాకు షేక్ హ్యాండ్ ఇప్పించే ప్రయత్నం చేసినా ఇద్దరూ కలవలేదు. దీంతో ఈసారి నగరి టికెట్‌ను వేరే వారికి ఇచ్చేందుకు మంత్రి పెద్దిరెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
సరే.. నగరి టికెట్ రోజాకు కాకపోతే ఎవరికి ఇస్తారు? ఎవరా సరైన అభ్యర్థి? దాని గురించి తెలియాలంటే ముందు నగరి నియోజకవర్గంలో సామాజికవర్గాల ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో చూడాలి. ఇక్కడ 2 లక్షల 70వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 50వేల మందికి పైగా మొదలియార్ సామాజికవర్గం వాళ్లే. రోజా భర్త సెల్వమణి కూడా మొదలియార్ సామాజికవర్గమే. అందుకే, ఆ ఓట్లన్నీ రోజాకు వస్తుండేవి. నగరిలో బలిజ, దళిత ఓట్లు ఎక్కువ. ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో నిర్ణయించేది బలిజలు, దళితులే. సో, రోజాకు ప్రత్యామ్నాయంగా వైసీపీ తరపున మరో లీడర్ కనిపించడం లేదు. కాకపోతే, బీసీ సామాజికవర్గానికి చెందిన ఒకరిని సెలక్ట్ చేశారని మాట్లాడుకుంటున్నారు. లేదంటే.. గాలి ముద్దుకృష్ణమ నాయుడు చిన్న కుమారుడు గాలి జగదీష్‌ను వైసీపీలోకి తీసుకొచ్చి పోటీ చేయించే ప్లాన్‌లో ఉన్నారంటున్నారు. కొంతకాలంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. మరి గాలి జగదీష్ టీడీపీని వదిలి వైసీపీలోకి వస్తారా? లేదా అన్నదీ చర్చనీయాంశం.
వైసీపీలో రోజాకు టికెట్ ఇచ్చే విషయంలో ఎంత కన్ఫ్యూషన్ ఉందో.. తెలుగు దేశం పార్టీలోనూ అంతే గందరగోళం నెలకొంది. నగరి టీడీపీ టికెట్ కోసం గాలి ముద్దుకృష్ణమ నాయుడు వారసులు పోటీ పడుతున్నారు. 2014లో గాలి ముద్దుకృష్ణమను ఓడించిన రోజా.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ముద్దుకృష్ణమ చనిపోవడంతో 2019లో ఆయన పెద్ద కుమారుడు భానుప్రకాశ్‌ను బరిలో దింపారు టీడీపీ అధినేత. అప్పుడు కూడా గాలి కుటుంబాన్ని ఓడించి రెండోసారి ఎమ్మెల్యే అయి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు రోజా.
దీంతో ఈసారి టీడీపీ తరపున తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు గాలి ముద్దుకృష్ణమ చిన్న కుమారుడు జగదీష్. ఇప్పటికైతే నగరి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా గాలి భానుప్రకాశ్ ఉన్నారు. టీడీపీ అభ్యర్ధిని తానేనంటూ తన అనుచరులకు చెప్పుకుంటున్నారు. పైగా తల్లి మద్దతు కూడా భాను ప్రకాశ్‌కే ఉంది. తమ రాజకీయ వారసుడు పెద్దకొడుకేనంటూ ఆమె కూడా ప్రకటించారు. దీంతో చిన్న కుమారుడు గాలి జగదీష్ ఒంటరి అయ్యారు. అందుకే, జగదీష్‌ను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతోందని, మంత్రి పెద్దిరెడ్డి చర్చలు జరుపుతున్నారని కొన్నాళ్లుగా ఓ ప్రచారం జరుగుతోంది. పైగా గాలి జగదీష్‌కు ఎన్నికలను ఎదుర్కోగలిగినంత ధనబలం కూడా ఉందని చెబుతుంటారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన కట్టా సుబ్రమణ్యం నాయుడుకు స్వయానా అల్లుడే ఈ గాలి జగదీష్. ఆర్థికంగానూ చాలా బలం ఉండడంతోనే వైసీపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ ఉంది. గాలి జగదీష్ బలం, బలగం తెలుసు కాబట్టే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నగరి టికెట్ విషయంలో ఇప్పటికీ తేల్చలేదని చెబుతున్నారు. ఏదేమైనా గాలి ముద్దుకృష్ణమ వారసులు టీడీపీలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు.
గాలి జగదీష్ పార్టీలోనే ఉండడం టీడీపీకి చాలా ఇంపార్టెంట్. ఎంత వరకు వాస్తవమో తెలీదు గానీ.. 2019లో నగరి టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాష్ ఓటమికి.. టికెట్ దక్కని టీడీపీలోని ఓ వర్గమే కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. కావాలనే ఆర్కే రోజాకు టీడీపీ తరపు నుంచి ఓట్లు వేయించి, ఆర్థికంగానూ రోజాకు సహకరించారని అప్పట్లో వినిపించింది. గాలి భానుప్రకాష్ ఓటమే లక్ష్యంగా ఆనాడు నగరి టీడీపీ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయిందని చెప్పుకున్నారు. సో, మరోసారి అలాంటి పొరపాటు జరక్కూడదనేది చంద్రబాబు ప్లాన్.
నగరిలో రోజా ఓడిపోవాలని కోరుకుంటున్న వారిలో జనసేన నేతలు కూడా ఉన్నారు. పవన్ కల్యాణ్‌పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారన్న ఆగ్రహం వారిలో ఉంది. అందుకే, రోజాకు, జనసేన కార్యకర్తలకు మధ్య అప్పుడప్పుడు ఘర్షణ జరుగుతుంటుంది.
పైగా పొత్తులో భాగంగా చిత్తూరు జిల్లా నుంచి కూడా టికెట్లు ఆశిస్తోంది జనసేన. చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తితో పాటు నగరి నియోజకవర్గం కూడా ఈ జాబితాలో ఉంది. అందులోనూ నగరిలో బలిజ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువ. గెలుపోటములు నిర్ణయించే బలమైన సామాజికవర్గం కూడా. రోజాను ఓడించి తీరాలనే కసితో ఉన్న నాగబాబు కూడా.. ప్రత్యేకంగా నగరి నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారని చెబుతుంటారు.
ఫైనల్‌గా నగరి టికెట్ ఎవరికి దక్కబోతోంది? ఆర్కే రోజాకే ఇస్తారా? అభ్యర్థిని మారుస్తారా? మారిస్తే ఎవరికిస్తారు? ఇటు టీడీపీ నుంచి బరిలో దిగేది ఎవరు? అన్నదమ్ముల్లో ఎవరి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తారా? ఏదేమైనా నగరి రాజకీయం మాత్రం కొంత అస్పష్టంగానే ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..